టాప్-2లో నిలిచిన సోమాజిగూడ
ప్రపంచస్థాయి నగరంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. దేశంలోని టాప్-10 హైస్ట్రీట్స్‌లో సోమాజీగూడకు రెండోస్థానం దక్కింది. దేశంలోని అన్ని మహానగరాల్లో మెరుగైన షాపింగ్ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్ మార్కెట్లలో సోమాజిగూడ నిలవడం నగరవాసులకు ఆనందాన్నిస్తోంది. ఈ జాబితాలో బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్డు తొలి స్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
భారత్ లోని ఏడు మెట్రో నగరాల్లో నైట్‌ఫ్రాంక్ సంస్థ సర్వే నిర్వహించింది.. థింక్ ఇండియా థింక్ రిటైల్-2023 హైస్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్‌లుక్ పేరుతో నివేదికను విడుదల చేయగా షాపింగ్ చేసేందుకు సోమాజిగూడ అత్యంత అనుకూలమని తేలింది. ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులకు స్థానిక రిటైల్ వ్యాపారులు కల్పిస్తున్న పార్కింగ్ వసతులు, ఇతర సౌకర్యాలు చాలా బాగున్నాయని నైట్‌ఫ్రాంక్ తెలిపింది.

రిటైల్ వ్యాపార రంగంలో పోటీతత్వం బాగా పెరిగిపోయిందని ఆ సంస్థ ఇండియా సీఎండీ వెల్లడించింది. కొనుగోలుదారులకు.. మంచి షాపింగ్ అనుభూతిని ఇవ్వటమనేది చాలా కీలకంగా మారిందని, అయితే.. అలాంటి షాపింగ్ అనుభూతి కలిగించే వీధులను హైస్ట్రీట్‌లుగా గుర్తిస్తారని పేర్కొంది. సోమాజిగూడలోని వీధిలో వ్యాపారులు కల్పిస్తున్న సౌకర్యాలకు కొనుగోలుదారుల నుంచి స్పందని రావడంతో వారి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సాగుతున్నట్లు తెలిపింది.
సోమాజీగూడ మొదట్లో ప్రశాంతంగా నివసించే నివాస సౌకర్యాలున్న ప్రాంతంగా పేరు పొందింది. క్రమేణా ఆధునిక వ్యాపార కేంద్రంగా మారింది. రాజ్ భవన్ రోడ్డుకు రెండువైపులా ఉన్న హైదరాబాద్ లోని వాణిజ్య కేంద్రంగా పేరు గడించింది. ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఆభరణాల సంస్థలు తమ వ్యాపారాలను ఇక్కడినుంచి కొనసాగిస్తున్నాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేటకు సమీపంలోనే ఉన్న ప్రాంతం కావడంతో సోమాజిగూడకు రోజురోజుకు ప్రాముఖ్యత పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ కూడా సోమాజిగూడలోనే ఉంది.












Click it and Unblock the Notifications