సారిక, ఆమె కుమారుల మృతిపై సోనియా కలత చెందారు: సర్వే
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనుమళ్ల సజీవ దహనం ఘటనపై ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా కలత చెందారని కాంగ్రెసు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరంలోని కాజీపేట దళిత కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాజయ్యకు తగిన శాస్తి జరుగుతుందని, త్వరలోనే పార్టీపరంగా అతన్ని శాశ్వతంగా బర్తరఫ్ చేసే అవకాశాలు సోనియాగాంధీ పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలో రాజయ్యపై ఉన్న కోపాన్ని తనపై చూపవద్దంటూ ఆయన ఓటర్లను కోరారు. రాజయ్య కు టికెట్ ఇచ్చినందుకు సోనియాగాంధీ పశ్చాత్తాప పడుతున్నారని, చనిపోయింది ఎవరి బిడ్డయినా.. బిడ్డేనని, ఈ విషయం తెలిసాక ప్రతి ఒక్కరి హృదయం దహించిపోయిందని, ఇలాంటి దుర్మార్గుడికి టికెట్ ఇచ్చి పెద్ద తప్పు చేశానన్న విషయం సోనియాగాంధీ ప్రజలకు చెప్పాల్సిందిగా తనను కోరారని అన్నారు.ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.

తెలంగాణ విషయంలో సోనియాగాంధీచే ఒప్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకవచ్చిన ఘనత కాంగ్రెస్సేనని, వచ్చిన తెలంగాణలో కెసిఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపించి గద్దె ఎక్కాడని ఆయన అన్నారు. ఇప్పుడు కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. ఇద్దరు ఎంపిలు ఉన్న టిఆర్‌ఎస్‌కు అందులో గత ఎంపి ఆయనను విడిచి వెళ్లిపోతే ఒకే ఒక ఎంపిగా ఉన్న కెసిఆర్ ఏనాడైనా పార్లమెంటులో తెలంగాణ గురించి మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు.
దమ్ము, ధైర్యం ఉంటే సిఎం తన ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే తాను పోటీ నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తెలంగాణ రావాలని ఎన్నడూ కూడా కెసిఆర్‌కు లేదని, తెలంగాణ పేరుతో దుకాణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ధ్యాసేతప్ప రాష్ట్రం ఏర్పడవద్దనే ఆయనకు ఉండేదన్నారు. అయితే, సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలపై చెలించి అన్ని పార్టీలను ఒప్పిం చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు.
ఎన్నికల ముందు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్న కెసిఆర్ అధికారం రాగానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కి దళితుడైన రాజయ్యకు డిప్యూటీ సిఎం పదవి ఇచ్చినట్లే ఇచ్చి మాదిగ జాతిని అవమాన పరిచే విధంగా మంత్రివర్గం నుండి తొలగించాడని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications