హైదరాబాద్ రానున్న సోనియా గాంధీ: ప్రతిష్టాత్మక భవన నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. జూన్ మొదటి వారంలో ఆమె నగరానికి రానున్నారు. ఇటీవలే కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా సోనియా గాంధీ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని పది ఎకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 'గాంధీ ఐడియాలజీ సెంటర్' భవన నిర్మాణానికి సోనియా గాంధీ శంకుస్థాపన చేస్తారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియాతోపాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర జాతీయ నాయకులు కూడా ఆహ్వానిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

జూన్ 1న లేదా మొదటి వారంలో ఈ కార్యక్రమం ఉండేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ బోయిన్‌పల్లి శివారులో సుమారు 10 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందులో గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు గతంలో దరఖాస్తు చేశారు.
ఈ క్రమంలో బుధవారం జరిగిన కంటోన్మెంట్ బోర్డ్ పాలక మండలి సమావేశంలో జీ ప్లస్ 2 భవనానికి అనుమతి ఇస్తున్నట్లు బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ప్రకటించారు. ఐడియాలజీ సెంటర్ కు అనుమతి లభించడంతో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని పీసీసీ కసరత్తులు చేస్తోంది. కాగా, ఈ భవనాన్ని పార్టీ జాతీయ స్థాయి అవసరాలకు ఉపయోగపడేలా పీసీసీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతోపాటు పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా థియేటర్, గాంధీ కుటుంబసభ్యులు హైదరాబాద్ వచ్చినప్పుడు విడిది చేసేలా ఏర్పాట్లు, ఏఐసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక ఛాంబర్, పార్టీ రాష్ట్రాస్థాయి, జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా నిర్మాణం ఉండబోతోందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని పదెకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 'గాంధీ ఐడియాలజీ సెంటర్' భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ స్థాయి నాయకులను కూడా ఆహ్వానిస్తామని పీసీసీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications