తెలంగాణ వెదర్ అప్‌డేట్: నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుండటం, మరోవైపు ఆవర్తనంతో జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మి.మీల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది.
మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదుకానున్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాల్లో విపత్తు స్పందన దళాలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలో ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు, నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి నిజామాబాద్ జిల్లాలో కొంత భాగం వరకు విస్తరించాయి.

కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాల్లో కొంత భాగం వ్యాపించాల్సి ఉంది. ఆదివారం నాటికి తెలంగాణ రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారంనాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిన పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకు హైదరాబాద్ తోపాటు వివిధ జిల్లాల్లో మోస్తరునుంచి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అత్యధికంగా 8 సెంటిమీటర్లు వర్షం కురిసింది. వరంగల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షం పడింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వర్షాలు.. ఆలస్యంగానైనా కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేస్తూ పొలం పనుల్లో బిజీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications