శ్రీతేజ్ కళ్లు తెరిచాడు కానీ.. తాజా హెల్త్ బులిటెన్ ఇలా
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతని ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని, ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని వెల్లడించారు. అప్పుడప్పుడు ఫిట్స్ లాంటివి వస్తున్నాయన్నారు. శ్రీతేజ్ కళ్లు తెరుస్తున్నాడని.. అయితే, మనుషుల్ని గుర్తు పడట్టం లేదని కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ వెల్లడించింది.

కాగా, శ్రీతేజ్ రెండు వారాలకుపైగా కిమ్స్ ఆస్పత్రిలోనే వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని శ్రీతేజ్ కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. కాగా, డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాల కోల్పోయిన విషయం విధితమే. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు.
వెంటనే పోలీసులు అతనికి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయవడంతో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటన కేసులో సంధ్య థియేటర్ యజమానితోపాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గత శుక్రవారం అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు 14 రోజులు కస్టడీ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కాగా, ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ పేపర్లు సరైన సమయంలో చంచల్‌గూడ జైలు అధికారులకు అందకపోవడం, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తీసుకొచ్చిన బెయిల్ పేపర్లు సరిగాలేకపోవడంతో ఆయన గత శుక్రవారం అర్ధరాత్రి వరకు జైలులోనే ఉన్నారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బెయిల్ పేపర్లు జైలు అధికారులు అందాయి.
అర్ధరాత్రి కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు అల్లు అర్జున్. ఇక్కడ పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు.దీంతో అక్కడ కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది. అక్కడ కూడా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు.












Click it and Unblock the Notifications