కేటీఆర్‌కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు: ఎందుకంటే?
అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సృజన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిది సృజన్ రెడ్డికి పనులు అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పగించారన్నారు. రూ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి రూ. 1000 కోట్ల విలువైన పనులు చేస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలన్నారు.
ఈ టెండర్ల అవినీతిపై కేంద్రానికి లేఖ రాశామని, ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపెడతామని కేటీఆర్ అన్నారు. రూ.8,888 కోట్ల కుంభకోణాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే కుంభకోణం ప్రారంభమైందని కేటీఆర్ అన్నారు. బావమరిది, తమ్ముళ్లకు అమృతం.. ప్రజలకు విషం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయని ధ్వజమెత్తారు.
అమృత్ టెండర్లలో సీఎం కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మరోసారి ఆరోపణలు చేశారు. సీఎం బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీ శోధాకు ఎలాంటి అర్హతలు లేవు. ఐహెచ్పీ కంపెనీ ద్వారా టెండర్వేయించారు. కేవలం 20 శాతం మాత్రమే చేస్తామని ఐహెచ్పీ లేఖ రాసింది. 80 శాతం సీఎం బావమరిది చేస్తారట. ఐహెచ్పీని శిఖండిలా వాడుకొని రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి అక్రమాలకు తెర లేపారని కేటీఆర్ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, సీవీసీ ఎవరైనా విచారణ చేపట్టి ప్రజాధనం కాపాడుకోవాలని అన్నారు. కేంద్రం విచారణ జరిపిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయన్నారు కేటీఆర్.












Click it and Unblock the Notifications