ప్రేమంటే ఆత్మహత్య చేసుకోవడం కాదు, నా దగ్గరకు రా!: యువకుడితో మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీ భవనంలోని మూడో అంతస్థులో ఏర్పాటుచేసిన ‘ఆత్మహత్యల నివారణ సెల్'ను గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. సెల్ ప్రారంభమైన ఐదు నిమిషాలకు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలానికి చెందిన ఓ యువకుడు(26) ఫోన్ చేయగా మొదటి కాల్‌ను మంత్రి లక్ష్మారెడ్డి అందుకొన్నారు.
‘మా కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె నా ప్రేమను తిరస్కరించింది. నేను ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నాను' అని ఆ యువకుడు మంత్రితో అన్నారు. ఆత్మహత్య చేసుకోవడం చాలా పాపమని ఆ యువకుడిని మంత్రి అనునయించారు.

‘నీ చ దువు కోసం ఎంతో కష్టపడ్డ తల్లిదండ్రులు నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. నీవు చనిపోయి వారిని రోడ్డు పాలు చేస్తావా?' అని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ప్రేమించిన అమ్మాయి, సెల్ నంబర్లు తనకు ఇవ్వాలని, స్వయంగా తానే సమస్యను పరిష్కరిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.

జీవితం విలువైనదని, అది తెలుసుకుని, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను ప్రేమించవచ్చని ఆయన తెలిపారు. ప్రేమ కోసం ప్రాణం తీసుకుంటే, కనిపెంచిన వారి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

‘లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చెబుతాను. సెక్రటేరియట్‌కు వచ్చి నన్ను కలువు' అంటూ మంత్రి ఆ యువకుడికి సూచించారు. చివరికి ఆత్మహత్య చేసుకోనని అతని నుంచి మాట తీసుకున్న మంత్రి, తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అనంతరం యువతను రక్షించాలనే లక్ష్యంతో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications