చల్లని కబురు: హైదరాబాద్ తోపాటు తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు వర్షాలు కూడా కురుస్తుండటంతో ప్రజలు భిన్న వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో అయితే, సాయంత్రం వరకు ఎండలు మండిపోతుండగా.. సాయంత్రం తర్వాత ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాత్రిపూట చల్లని వాతావరణం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండవేడిమి ఉంటోంది.
కాగా, మరో నాలుగు రోజులపాటు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. బుధ, గురువారాల్లోనూ హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

మరోవైపు, రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో పయనిస్తోందని, దీంతో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(IMD) తెలిపింది. హైదరాబాద్ తోపాటు ష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ, నారాయణపేట, కామారెడ్డి సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది ఇలావుండగా, బుధవారం హైదరాబాద్ లో ఈ ఏడాదిలోనే అత్యంత వేడివున్న రోజుగా నమోదైంది. రానున్న రాజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications