తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఎండ తీవ్రత, నెలాఖరు నుంచి మంటే
తెలంగాణ రాష్ట్రంలో నిన్నమొన్నటి వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో తెలంగాణ ప్రజలు అప్పుడే వేసవి కాలం మొదలైందా? ఇంత ఎండలు ఏంటీ అంటున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
కాగా, వాతావరణ మార్పులపై వాతావరణ శాఖ స్పందించింది. గాలుల కారణంగానే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలో క్రమంగా తేమ శాతం తగ్గుతుందని పేర్కొంది. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింద.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. నాలుగైదు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్, నిజామాబాద్, హనుమకొండ, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
ఉత్తర, ఈశాన్య, వాయువ్య జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడిగాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్లే ఎండ తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ సంచాలకులు వివరించారు. అయితే, ఫిబ్రవరి నెలాఖరు నుంచే అసలైన వేసవి కాలం ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయని చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications