ఏపీకి భారీ నిధులా?: బిజెపిపై సురవరం ఫైర్, ’తెలంగాణలో దొరల రాజ్యం’
హైదరాబాద్: ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు మంజూరు చేశామంటూ భారతీయ జనతా పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఏ ప్రభుత్వం ఇంతవరకు మంజూరు చేసిన నిధులపై స్పష్టతనిస్తూ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మంజూరైన నిధులపై కూడా శ్వేత పత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
'కేంద్రం నుంచి రాష్ట్రాలకు చట్టబద్ధంగానే నిధులు వస్తున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వ నేతలు తమ సొంత డబ్బుని ఇవ్వడం లేదు'ని సురవరం వ్యాఖ్యానించారు. కరవుతో బాధపడుతోన్న ప్రాంతాల పట్ల కూడా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు.

దొరల రాజ్యం చెల్లదు
తెలంగాణలో దొరల రాజ్యం చెల్లదని సురవరం అన్నారు. ఆరు నెలల్లో ధరలు 60 శాతం పెరిగాయని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను కొని అవినీతిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. యాగాలు, పుష్కరాలకు కోట్లు ఖర్చు పెడతారు కానీ, కరువు సహాయక చర్యలు ఎందుకు చేపట్టరని సురవరం నిలదీశారు.
టిఆర్ఎస్‌ను ఎదుర్కొవాలంటే.. : కోమటిరెడ్డి
టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే బలమైన నాయకత్వం కావాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బలమైన నాయకత్వం ఉంటేనే 2019 ఎన్నికల్లో గెలుస్తామని స్పష్టం చేశారు.
అందరినీ కలుపుకుపోయే నాయకుడు పీసీసీ చీఫ్‌గా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో తన సత్తా ఏంటో చూపించానని ఆయన అన్నారు. ఉత్తమ్‌ను ఎప్పుడు మార్చుతారో తెలియదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తిరిగి చేర్చుకోవద్దు
పార్టీని వీడిన వారు ఎంత పెద్ద నేత అయినా తిరిగి చేర్చుకోవద్దని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. మంగళవారం టీపీపీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిపై చర్య తీసుకోవాలన్నారు. టిఆర్‌ఎస్ కరపత్రాలైన నమస్తే తెలంగాణ, టీన్యూస్‌ను బహిష్కరించాలని, భూసేకరణ మీద ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కరువు కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై, టీఆర్‌ఎస్ హామీల అమలుపై పోరాడాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ హాజరవగా.. నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క జానారెడ్డి, షబ్బీర్‌అలీ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications