హైదరాబాద్ లో స్వీట్స్ తింటున్నారా..? అయితే మీ పని గోవిందా..!
హైదరాబాద్ లో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి. వాటిలో స్వీట్స్ కూడా ఒకటి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కొంతమంది స్వీట్స్, బేకరీ ఉత్పత్తులపై అలంకరణ కోసం వాడే స్వచ్ఛమైన వెండి రేకుల స్థానంలో.. ప్రమాదకరమైన అల్యూమినియం రేకులు.. పొడిని తయారు చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ దందాపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి చార్మినార్, ఫలక్ నుమా ప్రాంతాల్లో నకిలీ వెండి వర్క్ ముఠా గుట్టురట్టు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నాలుగు అక్రమ తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపారు.
ఈ తయారీ కేంద్రాల్లో ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి నకిలీ వెండి రేకులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని.. నాలుగు కేసులు నమోదు చేశారు. మరోవైపు FSSAI నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ దందాను కొనసాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్ నుంచి అల్యూమినియం ఫ్లేక్స్ తెప్పించి నకిలీ వెండి రేకులుగా మారుస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

కాజు కట్లీ, కాజు రోల్స్, చమ్ చమ్ వంటి స్వీట్స్ సహా మీఠా పాన్ లలో ఈ నకిలీ వెండిని వాడుతున్నట్లు గుర్తించామని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే జర్దా, కిమామ్ వంటి సువాసన పాన్ పదార్థాల్లోనూ అల్యూమినియం పొడిని కలుపుతున్నట్టు తేలిందన్నారు. ఈ తయారీ కేంద్రాల నుంచి తెలంగాణలో చిన్న దుకాణాలు, కొన్ని ప్రముఖ స్వీట్ షాప్స్ కు వీటిని సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు 49 బండిళ్ల నకిలీ అల్యూమినియం సిల్వర్ ఫాయిల్, 10 కేజీల అల్యూమినియం ఫ్లేక్స్ అలాగే ఒక కేజీ నకిలీ సిల్వర్ కోటెడ్ షుగర్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక వీటితో పాటు స్వీట్స్, పాన్ తయారీ పదార్థాలు, ప్యాకింగ్ మెషీన్స్, బరువు తూచే యంత్రాలు సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు ప్రజలు స్వీట్లు, పాన్ ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications
