టెక్కీలే టార్గెట్: ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో పెట్టుబడి! రూ. 6 కోట్ల టోకరా, అరెస్ట్
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వారి బంధువులను లక్ష్యంగా చేసుకుని సినిమాల్లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు దాదాపు రూ. 6 కోట్ల మేర బాధితుల నుంచి వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు తేలింది. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

ఆర్ఆర్ఆర్, అలవైకుంఠపురంలో పెట్టుబడులు!!
హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌లు తమను మోసం చేశారని బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి.. ఈ ముఠా మోసాలకు పాల్పడిందని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. సినిమా డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బోర్‌వెల్స్, పలు రంగాల్లో పెట్టుబడుల పేరుతో ఈ ముఠా తమను మోసం చేసిందని బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వెల్లడించారు. ఆర్ఆర్ఆర్, అలవైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్ధం, వెంకీమామ, రాక్షసుడు, నాంది లాంటి సినిమాల్లో తమ డబ్బు పెట్టుబడి పెడతామని, వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలు ఇస్తామని తమను నమ్మించారని తెలిపారు.

రూ. 6 కోట్ల మోసం.. మంత్రుల పేరుతో బెదిరింపులు
కాగా, సుమారు 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వారి బంధువుల నుంచి సుమారు రూ. 6 కోట్ల వరకు వసూలు చేశారు. కొందరు తమ డబ్బు తిరిగివ్వమని అడగడంతో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరుల పేరు చెప్పి బెదిరింపులకు దిగారు నిందితులు. తమను మోసం చేసిన అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమాశంకర్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని పోలీసులు బాధితులను వేడుకుంటున్నారు.

ప్రధాన నిందితులు అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
ఈ కేసులో ప్రధాన నిందితులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications