ఎన్టీఆర్ క్యాబినెట్లో కెసిఆర్ నాతో పాటే: కడియం
వరంగల్: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని, బంగారు తెలంగాణను సాకారం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో తాను విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టానని, అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టానని ఆయన చెప్పుకున్నారు. ఆనాడు కేసీఆర్ తనతోపాటే మంత్రిగా ఉన్నారని, అప్పటి నా పనితీరు చూసే తనకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారని చెప్పుకున్నారు.
ఎంతో నమ్మకంతో తనపై కెసీఆర్ ఈ బాధ్యత మోపారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని శ్రీహరి హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఆయన వరంగల్ జిల్లాకు వచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్క్‌లో జరిగిన సభలో టీఆర్‌ఎస్, దాని అనుబంధ శాఖల నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం కొట్లాడి ఎక్కిరించేటోళ్ల ముందు నవ్వులపాలు కావద్దని హెచ్చరించారు. ప్రభుత్వం అంటే ఆటా పాటా కాదని, వ్యాపారం అంతకన్నా కాదని, ప్రభుత్వం అంటే అభివృద్ధి, సంక్షేమం. ప్రజా ప్రతినిధులు, నాయకులు దీనిని అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. ఆమేరకు నడుచుకోవాలని సూచించారు. అందరికీ అవకాశాలు రాకపోవచ్చునని, వచ్చివవారు వాటిని కాపాడుకోవాలని ఆయన అన్నారు. సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అప్పుడే ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వ్యాఖ్యానించారు.
ఉప ముఖ్యమంత్రి పదవి తనకు అనూహ్యంగా లభించిందని చెప్పారు. ఒక ఎంపీ తాను రాష్ట్ర కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి అవుతాడని, మంత్రి అవుతాడని అనుకుంటాడా? కానీ, ఈ అసాధ్యం సుసాధ్యమైంది ఒక్క కేసీఆర్ వల్లనే అని చెప్పారు. తెలంగాణలో అక్షరాస్యతను పెంపొందించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ‘కేజీ నుంచి పీజీ' పథకాన్ని తాను సూచించానని, దానితో ఏకీభవించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన కేసీఆర్ ఇప్పుడు దాని అమలు బాధ్యతను కూడా తనపైనే మోపారని వివరించారు.












Click it and Unblock the Notifications