ప్రధాని మోడీని పొగిడారు సరే, వీటి మాటేమిటి: టార్గెట్ కేసీఆర్
హైదరాబాద్: మెదక్ జిల్లా గజ్వెల్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలకే పరిమితమయ్యారా? రాష్ట్ర సమస్యలను ఆయన ప్రధాని ముందు ఎకరువు పెట్టలేదా? వాటిని తీర్చాలని అడగలేదా? అంటే విపక్షాలు అవననే అంటున్నాయి.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు కేసీఆర్ తీరు పైన మండిపడుతున్నారు. ప్రధాని మోడీ పర్యటనను కేసీఆర్ వినియోగించుకోలేకపోయారని టిడిపి నేత రావుల మండిపడ్డారు. ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలో కూడా అడగలేకపోయారన్నారు.

ఏదో ఒక ప్రాజెక్టుకు అని చెప్పడం విడ్డూరమన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడగలేదన్నారు. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయే అన్నారు.
ప్రధాని మోడీని కేసీఆర్ మెచ్చుకున్నారు, అలాగే ఆయన ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు కానీ కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లలేకపోయారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. నిన్నటి సభలో ఒకరిని మరోకరు పొగడుకోవడమే సరిపోయిందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన 25 నెలల తర్వాత ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చారని, ఇందుకు ధన్యవాదాలు అని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని పర్యటనతో ఒరిగిందేం లేదన్నారు. భవిష్యత్తులో బీజేపీ, తెరాస కలిసే అవకాశం ఉందన్నారు. వారి అవకాశవాద రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications