కెసిఆర్ వ్యూహానికి టీ టిడిపి కుదేల్: 15 మంది ఎమ్మెల్యేలకు మిగిలింది ఆరుగురే...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యూహానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తిన్నది. టిడిపి నుంచి 15 మంది శాసనసభ్యులు గెలిస్తే పట్టుమని సగం మంది కూడా మిగలలేదు. ఓ వైపు టిడిపిని దెబ్బ తీస్తూనే, చేరికల ద్వారా హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో పాగా వేసే వ్యూహాన్ని కెసిఆర్ అనుసరిస్తున్నారు.
హైదరాబాదులోనూ దాని పరిసరాల్లోనూ టిడిపి బలాన్ని పూర్తిగా తగ్గించి, ఆ మేరకు బలం పుంజుకునే వ్యూహాన్ని ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తూ వస్తున్నారు. ఒకరకంగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యూహాన్నే ఆయన అమలు చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీని స్తంబింపజేశారు.
గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. గవర్నర్ పట్టించుకోవడం లేదని రాజ్‌భవన్‌లో బైఠాయించారు. కెసిఆర్ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి టిడిపి నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు. ఒకరి తర్వాత ఒకరు టిడిపి శాసనసభ్యులు టిఆర్ఎస్‌లోకి దూకేస్తూనే ఉన్నారు.
శాసనమండలిలో స్థానిక సంస్థల కోటా కింద 12 స్థానాలకు జరిగే ఎన్నికలకోసం ఒకవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలోకి చేర్చుకుంటున్న టిఆర్‌ఎస్ మరోవైపు ఎమ్మెల్యేలపై దృష్టిసారించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లతో పాటు ప్రజాప్రతినిధులకూ ఓటు హక్కు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై గురి పెట్టింది. రెండు పార్టీలకు చెందిన చాలామంది నాయకులు టిఆర్‌ఎస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారు. అయితే ఒకరి తరువాత ఒకరిని వ్యూహాత్మకంగా చేర్చుకుంటున్నారు.
ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై అసెంబ్లీలో పోడియం వద్ద బైఠాయించి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలే ఒకరి తరువాత ఒకరు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

తొలుత పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి చేరారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు టిడిపిలోకి వచ్చారు. తాజాగా గురువారంనాడు సాయన్న టిఆర్‌ఎస్‌లో చేరారు.
గత సాధారణ ఎన్నికల్లో టిడిపి నుంచి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, వీరిలో ఆర్ కృష్ణయ్య పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టిడిపికి ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వీరిలో మరికొందరు టిఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆరుగురిలో రేవంత్‌రెడ్డిది ఒక గ్రూపు కాగా, శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుది మరోవర్గం.
మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పలు సందర్భాల్లో తన నియోజకవర్గంలో నీటి సమస్య తీరిస్తే టిఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటిస్తూ వచ్చారు. అరెకెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, వివేకానంద తమ నియోజక వర్గాల్లో పట్టునిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications