యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం: అర్చకుడికి మాత్రమే కాదు..32 మందికి: దర్శనాల మాటేంటీ
యాదాద్రి భువనగిరి: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి రెక్కలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా అనేక జిల్లాలపై వైరస్ కమ్ముకుంటోంది. పంజా విసురుతోంది. కొద్దిరోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన యాక్టివ్ కేసులు నాలుగు వేలను మించిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. లాక్‌డౌన్ విధించబోమని, కోవిడ్ ప్రొటోకాల్‌ను మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనను పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తోంది.
తాజాగా- యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రిలో కరోనా వైరస్ కలకలం రేపింది. అర్చకుడితో పాటు ఏకంగా 32 మంది ఉద్యోగులు, ఆలయ సిబ్బందికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారిణి గీతారెడ్డి వెల్లడించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన కొద్దిరోజులకే ఈ స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆలయానికి వచ్చిన భక్తుల ద్వారా వారికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు గీతారెడ్డి పేర్కొన్నారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని స్వామివారి సేవలను నిలిపివేస్తున్నామని అన్నారు. ఆదివారం నుంచి ఆర్జిత సేవలు ఉండబోవని చెప్పారు. స్వామివారిని సందర్శించడానికి భక్తులకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో 30 మంది, వారాంతపు రోజుల్లో 50 వేల మంది వరకు భక్తులు సందర్శించే ఈ ఆలయంలో కరోనా వైరస్ కలకలం రేపడం ఆందోళనకు దారి తీస్తోంది. కోవిడ్ ప్రొటోకాల్‌ను తప్పనిసరి పాటించేలా భక్తులకు ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరికలను జారీ చేశారు ఆలయ అధికారులు. భౌతిక దూరం పాటించేలా క్యూ లైన్లలో సర్కిళ్లను చిత్రీకరించారు.
కరోనా మార్గదర్శకాలను పాటించేలా అన్ని జిల్లాల కలెక్టర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్లను జారీ చేసింది. మాస్కులను ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగాడే వారిపై భారీగా జరిమానాలను విధించాలని ఆదేశించింది. కరోనా ప్రొటోకాల్‌ను అనుసరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశిస్తూ శనివారమే ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల కార్యాలయాలకు ఆదేశాలను జారీ చేసింది. కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ జిల్లా అధికార, పోలీసు యంత్రాంగాలు స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications