వీడియో: 75వ స్వాతంత్ర్య దినోత్సవం..75 మీటర్ల జాతీయ పతాకం: తెలంగాణలోనే
జోగులాంబ గద్వాల: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతావనిలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం 7:30 గంటలకు దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్ భారత దేశాన్ని సాక్షాత్కరింపజేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జెండా పండుగ ఆనందోత్సాహాల మధ్య సాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ఎప్పట్లాగే చారిత్రాత్మక గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రతిష్ఠాత్మకంగా భవిస్తోన్న దళిత బంధు పథకాన్ని ప్రస్తావించారు. ఈ పథకంతో నవశకానికి నాంది పలకబోతోన్నామని చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దళితుల జీవితాల్లో నూతన ఒరవడిని తీసుకొస్తామని అన్నారు. దళితుల సమగ్ర వికాసానికి తెలంగాణ ఓ చిరునామాగా మారేలా.. ప్రతి రాష్ట్రం కూడా అనుసరించేలా చేస్తామని చెప్పారు.

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రెండున్నర సంవత్సరాల ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు. నవరత్న పథకాలను ప్రస్తావించారు. జనరంజకమైన పాలనను అందిస్తున్నామని, ప్రకృతి సైతం సహకరిస్తోందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మేలు జరిగేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని, వ్యవసాయ రంగంపై 83 వేల కోట్ల రూపాయలను వ్యయం చేశామని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రత్యేకంగా నిలిచింది. ఈ జిల్లాలోని మానోపాడు మండలం అమరవాయి గ్రామస్తులు భారీ జాతీయ పతాకాన్ని రూపొందించారు. గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 75 మీటర్ల జాతీయ పతాకాన్ని గ్రామస్తులు రూపొందించారు. గ్రామం మొత్తం ఆ జెండాతో ప్రదర్శన చేశారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ నినదించారు. దీన్ని తయారు చేయడానికి నెలరోజులు పట్టిందని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications