తెలంగాణ ఎన్నికల షెడ్యూల్, కౌంట్ డౌన్ - కీలక సమాచారం..!!
తెలంగాణ(Telangana) ఎన్నికల షెడ్యూల్(Schedule) ఏ క్షణమైన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 6వ తేదీనే విడుదలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ రోజు కాకుంటే ఈ నెల 9వ తేదీన విడుదల చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కేంద్రంలోని బీజేపీ(BJP)..రాష్ట్రంలోని బీఆర్ఎస్(BRS) తమ పార్టీ శ్రేణులను షెడ్యూల్ పైన అప్రమత్తం చేస్తున్నాయి. ఈ రోజు కేంద్ర కేబినెట్(Central Cabinet) లోనూ తెలంగాణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఏ క్షణమైనా షెడ్యూల్
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, హామీల జోరు పెంచింది. పెండింగ్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను ప్రకటిస్తున్న సర్కార్ ఉద్యోగులకు పీఆర్సీ కమిటీని, ఐఆర్‌ను ప్రకటించింది. అంగన్‌వాడీలను పీఆర్సీ పరిధిలో చేర్చింది. రెండు మూడు రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలను, వరాలను గుప్పించేందుకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ పైన రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. పర్యటన ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనున్నారు.

నివేదిక ఆధారంగా
ఎన్నికల సంఘం టీం ఇచ్చే నివేదిక ఆధారంగా షెడ్యూల్ విడదల కానుంది. షెడ్యూల్ జారీ నుంచి ఎన్నికలకు 2 నెలల సమయాన్ని నిర్దేశించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపత్యంలో ఏదేమైనా ఈ నెల 10 దాటకుండా షెడ్యూల్ జారీకే సీఈసీ మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5నుంచి 10లోగా షెడ్యూల్ ఖరారు కానుంది. తద్వారా డిసెంబర్ రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 వరకు ఉంది. 2018లో అక్టోబర్ 6న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సరిగ్గా రెండు నెలలకు అంటే డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా జనవరి 17న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో జనవరి 16వ తేదీ వరకు ప్రస్తుత అసెంబ్లీ మనుగడలో ఉండనుంది.

పార్టీలు సిద్దం
తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్ర అసెంబ్లీలకు కూడా ఒకేసారి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. బుధవారం ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ఢిల్లీ నాయకత్వం నుంచి ఎన్నికలకు సిద్దంగా ఉండాలని రాష్ట్ర పార్టీ నేతలకు సంకేతాలు అందుతున్నాయి. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ సైతం ఎన్నికల నిర్ణయాలను వేగంగా అమలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. రేపు (గురువారం) ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. షెడ్యల్ ప్రకటించిన వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. దీంతో, ఎన్నికల రాజకీయంగా మొదలు కానుంది.












Click it and Unblock the Notifications