70 మందితో తెలంగాణ బీజేపీ తొలి జాబితా..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజున వెలువడుతుంది. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

పోలింగ్‌కు నెలన్నర రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి ఇప్పటికే జనంలోకి వెళ్లింది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పలు జిల్లాల్లో భారీ ఎత్తున ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తోన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బరిలో దిగారు. బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జగ్గా రెడ్డి.. ఇలా ఆ పార్టీ సీనియర్లందరూ రాష్ట్రస్థాయి పర్యటనల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు.
అటు- భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. జనగర్జన పేరుతో జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. వంటి జాతీయ స్థాయి నాయకులు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటోన్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు విడదల అయ్యాయి. ఈ విషయంలో బీజేపీ వెనుకంజలో ఉంది. అభ్యర్థుల జాబితాను విడుదల కావట్లేదు. ఈ రెండు రాజకీయ ప్రత్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ విడుదలైన తరువాత.. ఇదివరకే రూపొందించిన జాబితాలో మార్పులు చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో నిర్వహించిన ఎన్నికల కమిటీలో- అభ్యర్థుల జాబితాపై తుది ఆమోదం లభించినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ జాబితాను నేడు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తోన్నారు. తొలి జాబితాలో 70 మంది వరకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications