స్పష్టత లేదు: రేవంత్, కెసిఆర్ హెచ్చరిక, ప్రతిపక్షాలు మొత్తం సభ నుంచి సస్పెన్షన్
హైదరాబాద్: మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సోమవారం తిరిగి ప్రారంభమైంది. అక్టోబర్ 1న విపక్షాలు సభలో నిరసన తెలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. గాంధీ జయంతి, శని, ఆదివారాలు వరుసగా రావడంతో మూడురోజుల పాటు సభ వాయిదా పడింది.
సోమవారం నుంచి పదో తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి మధుసూధనా చారి తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
రైతులకు ఒకేసారి రుణాలు మాఫీ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రైతుల ఆత్మహత్య, రుణమాఫీ పైన టిడిపి, ఒకేసారి రుణమాఫీ చేయాలని బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు తీర్మానం ఇచ్చాయి. అయితే, రుణమాఫీ ఓకేసారి చేయాలని సభలో పెద్ద ఎత్తున విపక్షాలు నినాదాలు చేయడంతో వారిని సస్పెండ్ చేశారు.

ఏం చేయాలో మాకు తెలుసు: కెసిఆర్
రైతు ఆత్మహత్యల విషయమై ప్రభుత్వం ఏం చేయగలమో చెప్పిందని, అంతేకానీ సాధ్యం కాని కోరికలు కోరితే మేం ఏం చేయలేమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి రెండు రోజులు రైతు సమస్యల పైన చర్చించామన్నారు.
మేం చెప్పిందే జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. మూడో వంతు కూడా లేని సభ్యులు మేం చెప్పిందే జరగాలంటే ఎలా అన్నారు.
సభ జరగనివ్వమని అంటే సరికాదన్నారు. ప్రభుత్వం చెప్పింది నచ్చకుంటే నిరసన తెలిపే పద్ధతులు ఉన్నాయన్నారు. ప్రతిపక్షాల తీరు మారకుంటే ఏం చేయాలో తమకు తెలుసునని ముఖ్యమంత్రి కెసిఆర్ విపక్షాలను హెచ్చరించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్
ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు శాసన సభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు సోమవారం నాడు ప్రకటించారు. టిడిపి, కాంగ్రెస్, బిజెపి, వామపక్ష శాసన సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. వీరిపై ఈ సమావేశాలు మొత్తానికి సస్పెన్షన్ విధించారు.
సస్పెన్షన్‌కు గురైన వారు... కాంగ్రెస్‌కు చెందిన వారు.. పువ్వాజ అజయ్ కుమార్, డికె అరుణ, మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సంపత్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రాంరెడ్డి వెంకట రెడ్డి.
టిడిపి సభ్యులు.... అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, ప్రకాశ్ గౌడ్, రాజేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సాయన్న, జి వివేకానంద
బిజెపి సభ్యులు... కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, చింతల రామచంద్ర రావు, ప్రభాకర్, వామపక్ష సభ్యులు.. వెంకటేశ్వర్లు, రవీంద్ర కుమార్, సున్నం రాజయ్యలు ఉన్నారు.












Click it and Unblock the Notifications