అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు కోత: ఈ నెల 9 వరకే, విపక్షాల బందే కారణమా?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక రోజు ముందుగానే ముగియనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10 వరకు సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 9వ తేదీ వరకే సమావేశాలు జరగనున్నాయి. సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే 'రైతుల ఆత్మహత్యల నియంత్రణలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించ లేదు.
ఆత్మహత్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రుణమాఫీని ఒకే దఫా మాఫీ చేసే ప్రకటన చేయాలి' అంటూ విపక్ష పార్టీల సభ్యులు కోరారు. దీనికి స్పీకర్ సమాధానమిస్తూ 'రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఇప్పటికే వివరణాత్మక సమాధానం చెప్పింది. 12 గంటలకు పైగా చర్చసాగింది. మళ్లీ చర్చకు వచ్చే అవకాశం లేదని' అన్నారు.
అయినా సరే సభ్యులు పట్టువీడక పోవడంతో సభ నుంచి మజ్లిస్ మినహా విపక్ష సభ్యులందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సభలో అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాయి. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఈ నెల 9 వరకు ప్రభుత్వానికి గడువిచ్చాయి.

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 10వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని ప్రకటించాయి. అసెంబ్లీలో శానససభ్యుల సస్పెన్షన్ కారణంగా తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఒక్కటైన సంగతి తెలిసిందే.
తెలంగాణలో రూ.10 స్టాంప్ పేపర్లకు చెల్లుచీటి
తెలంగాణలో ఇకపై రూ. 10 నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లు ఉండవని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అధీకృత స్టాంప్ వెండర్ల వద్ద ఉన్న స్టాక్ అయిపోగానే, వెంటనే రూ.10 స్టాంప్ పేపర్లపై నిషేధం విధించనున్నట్లు సోమవారం తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాల జారీ కోసం చాలా మంది ఇప్పటిదాకా రూ.10 స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ ఇచ్చేవారు. ఈ అఫిడవిట్ల కోసం ఇకపై రూ.20 స్టాంప్ పేపర్లను వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications