MGBS నుంచి కదలని బస్సులు
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రతిపాదించిన తెలంగాణ బంద్.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు ఇందులో పాల్గొంటోన్నాయి. టీజేఎస్, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు వంటి సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. బంద్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులేవీ కూడా డిపోల నుంచి బయటికి రాలేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో జేఏసీ నాయకులు ఆందోళన, రాస్తారోకో, బైఠాయింపులను నిర్వహిస్తోన్నారు.
42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు కూడా ఈ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని విజయవంతం చేయడానికి అన్ని వర్గాల సహకారాన్ని తీసుకున్నాయి బీసీ సంఘాలు. ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. బంద్ లో పాల్గొంటోన్నాయి. దీనికి సంఘీభావంగా రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు, కళాశాలలు బంద్ పాటిస్తోన్నాయి. నేడు సెలవును ప్రకటించాయి.

ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఉద్యోగుల జేఏసీ నాయకులు బంద్ పాటిస్తోన్నారు. కొన్ని చోట్ల బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజా రవాణా స్తంభించింది. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటిని ఎక్కడికక్కడ బీసీ సంఘాల నాయకులు అడ్డుకుంటోన్నారు. ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకు దిగారు. గేట్ మీటింగులు నిర్వహిస్తోన్నారు. అక్కడే బైఠాయించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తోన్నారు.
బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ బోసి పోయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులు కదలట్లేదు. సిటీబస్సులు తిరుగాడట్లేదు. అవన్నీ కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. ఫలితంగా ప్రయాణికలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలపై ఆధార పడాల్సి వస్తోంది. ఆటోలు, ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తోన్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తోన్నారు.
బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఆస్తులపై దాడులకు దిగితే కఠిన చర్యలను తీసుకుంటామని డీజీపీ బీ శివధర్ రెడ్డి ఇదివరకే హెచ్చరించారు కూడా. శాంతియుతంగా బంద్ నిర్వహించాలని కోరారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసులను మోహరింపజేశారు.












Click it and Unblock the Notifications