సర్వే: పొగ, మద్యం విషయంలో ఏపీ, మిగితా విషయాల్లో తెలంగాణదే పైచేయి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగ్గా ఉందని ఓ సర్వే తేల్చింది. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఖర్చులు(అద్దెలు) తక్కువగానే ఉన్నాయని సాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్‌లైన్ సర్వే 2014 వెల్లడించింది. దేశంలోని 21 పెద్ద రాష్ట్రాల నుంచి సేకరించిన అంశాల ఆధారంగా రూపొందించినట్లు నివేదికను రూపొందించిన సర్వే పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలవిషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రి సేవల లభ్యత 53.7శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, 40శాతంతో మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో ఉంది. కాగా, 27.4శాతం ప్రభుత్వ వైద్య సేవలు ఏపీలో అందుబాటులో ఉన్నాయి.

ప్రైవేట్ ఆస్పత్రుల వైద్య సేవల్లోనూ 53.7శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, 24శాతం మాత్రమే వైద్య సేవలు ఏపీలో అందుబాటులో ఉన్నాయి. అయితే పట్టణ, నగరాల విషయానికొస్తే మాత్రం ఏపీ పైచేయి సాధించింది.
పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ వైద్య సేవలు ఏపీలో 93.6శాతం అందుబాటులో ఉండగా, 89.4శాతం ప్రైవేట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇదే విషయంలో తెలంగాణలో 82.7, 85.6శాతం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సేవలను అందుబాటులో ఉంచింది.
ఇక గ్రామీణ ఇంటర్నెట్ సౌకర్యాల విషయంలో 62శాతంతో దేశంలోనే రెండో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఈ విషయంలో కేరళ రాష్ట్రం 94.6శాతంతో అగ్రస్థానంలో ఉంది. 34.4శాతంతో కర్ణాటక ఉంది.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఏటీఎంల సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 71.4శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉండగా, 63.6శాతంతో తెలంగాణ ద్వితీయ స్థానంలో ఉంది. ఏపీ మాత్రం 28.8శాతం మాత్రమే కలిగివుంది.
కాగా, అత్యధిక గ్రాడ్యుయేట్లు(17.7శాతం) కలివున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ కొనసాగుతోంది. న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఏపీ మాత్రం 10శాతం నమోదు చేసింది. పట్టణ మురుగు కాల్వల నిర్వహణలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలూ వెనబడే ఉన్నాయి. 36.6శాతంతో తెలంగాణ, 30.6శాతంతో ఏపీ ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా, స్మోకింగ్, డ్రింకింగ్ విషయంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 15 నుంచి 29ఏళ్ల వయస్సువారు 3.8శాతం ఏపీలో పొగ తాగుతుండగా, అది తెలంగాణలో 1.5శాతంగా ఉంది. ఇక మద్యం విషయానికొస్తే ఏపీ 5.5శాతంతో ముందుండగా, తెలంగాణ 5.1శాతంతో కాస్త వెనకబడి ఉంది.












Click it and Unblock the Notifications