రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, శ్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున అందిస్తాం.. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు చొప్పున నిధులు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించిందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ రెండు నాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయి.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించాం.. జూన్ 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులందరం అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.

ఇక హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం (LIG) లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.. వెంటనే ఆ కుటుంబాలన్నింటికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు.












Click it and Unblock the Notifications