రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ: కీలక అంశాలు లేకుండానే
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. శనివారం జరగాల్సిన సమావేశం ఈసీ అనుమతి లభించక వాయిదా పడింది. ఆదివారం ఈసీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని షరతులు విధిస్తూ కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఏజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4వ తేదీ వరకు పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరుకావద్దని ఆదేశించింది.

కాగా, రైతు రుణమాఫీ, ఏపీ-తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు,ఖరీఫ్ పంటల ప్రణాళిక, ఇంకా రైతులకు సంబంధించిన అనేక అంశాలు, పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభానికి సన్నాహకాలపైన శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
అంతేగాక, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై కూడా సీఎం రేవంత్ చర్చించాలని భావించారు అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్, వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మంత్రిమండలి సమావేశ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది. ఈ క్రమంలో పలు షరతులతో విధించిన ఈసీ.. కేబినెట్ భేటీకి అనుమతిచ్చింది.












Click it and Unblock the Notifications