Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్: ప్రసంగ పాఠం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఉదయం 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. అనంతరం పోలీసుల గౌరవందనం స్వీకరించారు.

ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడేళ్లలో తెలంగాణ స్థిరంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్టాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధిని సాధించామన్నారు.

 Telangana CM KCR unfurls national flag at Golconda Fort

ప్రగతిఫలాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం తెలిపారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. విద్యుత్, సాగు, తాగునీటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శమని చెప్పారు.

తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తాము చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు.

ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలోనే తెలంగాణను నెంబర్‌ వన్‌గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు.

ఒకప్పుడు తెలంగాణ కరువుకాటకాలకు నిలయంగా ఉండేది. ప్రస్తుతం అదే తెలంగా ణ 2020-21 వ్యవసాయ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 3.4 లక్షల టన్నుల దిగుబడిని సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీడీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయ రంగం సమకూరుస్తున్నది. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిన తెలంగాణ

ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాలకోసం, పేదలకు రేషన్ బియ్యం పంపిణీకోసం పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. అవి తినడానికి కూడా పనికొచ్చేవి కాదు. కానీ ఈ రోజు తెలంగాణ రైతన్నలు రాష్ట్రానికే కాదు, దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా'గా అవతరించిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

దేశంలో దళితుల పట్ల సామాజిక వివక్ష కొనసాగుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకు తెలంగాణ కూడా మినహాయింపు కాదని అన్నారు. అందుకే దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను, పథకాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే దళితుల అభివృద్ధి కోసం అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని తెలిపారు. ఈ మొత్తం దళితుల అభ్యున్నతికి తోడ్పడుతుందని అన్నారు.రానున్న రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి పథంలో పయనిస్తుందని కేసీఆర్ ఆకాంక్షించారు.

ప్రగతి భవన్‌లో జెండా పండగ

ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన స్వాత్రంత్ర్య సమరయోధులు, మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సైనిక అమరవీరులకు కేసీఆర్ నివాళులు

ఆదివారం ఉదయం సైనిక వీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకున్నారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు.

కాగా, పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. కోట పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళారూపాలను ప్రదర్శించారు.

సిరిసిల్లలో జెండా ఎగురవేసిన మంత్రి కేటీఆర్

పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో ఐటీ మంత్రి కేటీఆర్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

మరోవైపు, నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Recommended Video

    Spl Report On CM Kcr Inspection New Secretariat

    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ దామోదర్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జయశంకర్‌ భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ భాను ప్రకాశ్‌ రావు పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+