కేపీహెచ్‌బీ టూ బయోడైవర్సిటీ.. పట్టాలెక్కనున్న పీఆర్టీఎస్ లైన్!
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించి, ప్రజలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్) పై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, హైదరాబాద్ మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో అదనపు ఎండీ అజిత్ రెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పీఆర్టీఎస్ తో హైదరాబాద్ వాసులకు కొత్త అనుభవం
పీఆర్టీఎస్ వ్యవస్థ గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా గరిష్ఠంగా జనాభా ఉన్న ప్రాంతాలు, ఎప్పుడూ ట్రాఫిక్ తో నిండి ఉండే ప్రాంతాలకు ఈ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. చిన్నపాటి ఆటోమేటెడ్ వాహనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దారుల్లో ప్రయాణిస్తాయని, బస్సుల్లాగా ప్రతీ స్టాప్ లో ఆగాల్సిన పని లేకుండా నేరుగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేరవేస్తాయని సీఎం వివరించారు. ఈ వ్యవస్థతో రోడ్లపై ట్రాఫిక్ తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని, ప్రజలు సొంత వాహనాలపై ఆధారపడటం తగ్గిపోతుందన్నారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్లకి, ప్రధాన వాణిజ్య కేంద్రాలకి, ప్రభుత్వ ఆఫీసులకి అనుసంధానంగా ఈ వ్యవస్థ పని చేస్తుందని సీఎం తెలిపారు.

ముఖ్య లైన్ లు.. ప్రణాళికలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్టీఎస్ లైన్ లకు సంబంధించిన పలు సూచనలు చేశారు.
- ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్ స్టాండ్ వరకు ఒక లైన్ ను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి.
- అలాగే అసెంబ్లీ మెట్రో నుంచి రవీంద్ర భారతి, సెక్రటేరియట్, ఐమాక్స్ నుంచి బేగంపేట్ కు కలుపుతూ మరో లైన్ ను ఏర్పాటు చేయాలని
- నక్లేస్ రోడ్ లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి, అందులోనే పీఆర్టీఎస్ డిపోను కూడా ఏర్పాటు చేయాలి.
- కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్ స్పేస్, బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు లైన్ పనులను వెంటనే మొదలుపెట్టాలి.
- గచ్చిబౌలి ఐకియా సమీపంలో కూడా మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి, అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలి.
డిసెంబర్ లో టెండర్ లు.. ఏడాదిలో పూర్తి
ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి, పనులను మొదలుపెట్టాలని సీఎం సూచించారు. పనులు మొదలైన ఏడాదిలోనే ఈ లైన్ ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులకు చెప్పారు. ఈ వ్యవస్థతో మెట్రో స్టేషన్ లు, ప్రధాన ప్రభుత్వ ఆఫీసులు, వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, బస్ స్టాండ్ లకు మధ్య అనుసంధానం మెరుగుపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో స్టేషన్ల వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం ఉండటం వల్ల ప్రజలు తమ వాహనాలను పార్క్ చేసి పీఆర్టీఎస్ లో ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని సీఎం తెలిపారు.
భారత్ లో హైదరాబాద్ కొత్త అధ్యాయం
భారత్ లో పీఆర్టీఎస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అమృత్ సర్ లో విమానాశ్రయం, రవాణా వ్యవస్థ మధ్య చిన్నపాటి ఆటోమేటెడ్ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ, గురుగ్రామ్, ఢిల్లీ-ఎన్సీఆర్ లో ఇలాంటి ప్రాజెక్టుల గురించి ప్రతిపాదనలు మాత్రమే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ లో ప్రతిపాదించిన పీఆర్టీఎస్ వ్యవస్థ భారత్ లోనే అత్యంత భారీ ప్రణాళికగా అధికారులు అభివర్ణించారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే హైదరాబాద్ నగరం రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
