తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ - ఏకగ్రీవ తీర్మానం, హైమాండ్ అంగీకారం..!?
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఎం ఎంపికపైన పార్టీ అధినాయకత్వానికి అధికారం అప్పగిస్తూ తీర్మానం చేయనున్నారు. ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాల మేరకు రేవంత్ తెలంగాణ నూతన సీఎం కానున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ గెలుపుతో: తెలంగాణలో కాంగ్రెస్ విజయకేతనం ఎగుర వేసింది. 65 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇక..కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను హైదరాబాద్ రావాల్సిందిగా పార్టీ ఆదేశించింది. ఈ రాత్రి గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమై తమ కొత్త నేతను ఎన్నుకుంటారు.

పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్ తో పాటుగా కీలక నేతల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ తీర్మానం చేస్తారని తెలుస్తోంది. రేపు గవర్నర్ ను కలవనున్న కాంగ్రెస్ బృందం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించనున్నారు.
ఎమ్మెల్యేల సమావేశం: ఈ సమావేశంలో అధికారికంగా హైకమాండ్ కు సీఎం అప్పగింత బాధ్యత ఇస్తూ తీర్మానం చేసినా..మెజార్టీ శాసనసభ్యులు రేవంత్ కు సీఎం పదవి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ ముఖ్య నాయకత్వం రేవంత్ ను ఫోన్ చేసిన ప్రశంసించారు. ప్రమాణ స్వీకారానికి చేస్తున్న ఏర్పాట్ల పైన చర్చించారు.
ఈ నెల 9న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎంతో పాటుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకు రేవంత్ కు సీఎం పదవి దక్కుతుందా లేదా అనే చర్చ సాగింది. కానీ, తెలంగాణతో పాటుగా ఎన్నికలు జరిగిన మరో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఈ సమయంలో తెలంగాణలో విజయం సాధించటంతో ఇక్కడ ప్రధాన బాధ్యతలు నిర్వహించిన రేవంత్ కు సీఎం చేస్తారని ఢిల్లీ వర్గాల సమాచారం.

రేవంత్ సీఎం అవుతారా: సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎస్సీ వర్గానికి చెందిన భట్టి పేరు ప్రచారంలోకి వచ్చినా.. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు..అదే విధంగా అమలు చేయాల్సిన హామీలు ఇప్పుడు ప్రధానంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండటంతో వారికి అవకాశం ఇవ్వకుండా ఇదే టెంపో పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగేలా రేవంత్ కు పార్టీతో పాటుగా ప్రభుత్వ బాధ్యతలు అప్పగించానే ఆలోచన పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సామాజిక సమీకరణాలను అమలు చేసేలా కొత్త మంత్రివర్గ కూర్పు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం ప్రమాణ స్వీకారానికి రాహుల్, ప్రియాంక తో పాటుగా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు..పీసీసీ చీఫ్ లు హాజరు కానున్నారు. రేపు రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో..సీఎం విషయంలో పార్టీ హైకమాండ్ అధికారికంగా చేసే ప్రకటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications