యాసంగిలో వరి వేయొద్దు: రైతులకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సూచన
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగిలో వరిసాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రైతులకు సూచించారు. శనివారం తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎం సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయశాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిర్ణయించాయని తెలిపారు. రాష్ట్రంలో యాసంగి వరి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలంగా ఉన్నాయని.. ఈ క్రమంలో రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దని స్పష్టం చేశారు.

పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈ క్రమంలో రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దని సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న రైతులు వరిసాగు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే కొంటామని కేంద్రం చెప్పిందని.. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అవసరమైన ప్రాంతాల్లో కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్నట్లు సమాచారం అందిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
కాగా, యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారని తెలంగాణ మంత్రులు తెలిపారు. ఇటీవల హస్తిన వెళ్లిన తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డితో పాటు ఎంపీలు నామా నాగేశ్వర రావు, బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి... కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా యాసంగిలో వరి ధాన్యం సేకరణపై చర్చించారు. అయితే, . కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం రాలేదని చెప్పారు మంత్రులు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎస్ యాసంగిలో వరి వేయొద్దని రైతులకు సూచించినట్లు తెలిస్తోంది.












Click it and Unblock the Notifications