ఒరేయ్... వేణుస్వామి ఎక్కడున్నాడో వెతకండ్రా?
వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీరంగంలో సెలబ్రిటీల గురించి, రాజకీయ రంగంలోని సెలబ్రిటీల గురించి జాతకాలు చెబుతూ ఆయన కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయారు. సినిమా రంగంలో ఆయనచేత పూజలు చేయించుకున్న రష్మికలాంటివారు నేషనల్ క్రష్ గా ఉండటం, సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పడం.. తర్వాత అదే జరగడంతో గతంలో వేణుస్వామి ఏం చెప్పాడు? ఎవరి గురించి మాట్లాడాడు? అనే విషయాలను నెటిజన్లు సెర్చ్ చేసి మరీ తెలుసుకునేవారు.
వేణుస్వామి గతంలో చెప్పిన కొన్ని వీడియోల్లో తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని, కేంద్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. అంతేకాకుండా అష్టమంలో శని ఉంది... షష్టమంలో శని ఉందంటూ ఊదరగొట్టారు. వీటికి ముందే 2023 జనవరిలో కేంద్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు సంభవిస్తాయని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. పదవుల్లో ఉన్నవారికి న్యాయపరమైన చిక్కులుంటాయని, బ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారంటూ ఇతర నేతల గురించి కూడా చెప్పారు.

ఇవన్నీ చూసిన ప్రజలు నిజమే కాబోలు అనుకొని తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి రేపో మాపో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో నెటిజన్లు మరోసారి వేణుస్వామి గతంలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం జరుగుతోంది? అనే విషయాలను తెలుసుకోవడానికి పాతవీడియోలను చూశారు. వాటిల్లో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారని ఉంది. కానీ అందుకు విరుద్ధంగా భారత రాష్ట్ర సమితి ఓడిపోవడం, కేసీఆర్ గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించడం జరిగిపోయాయి. ఇంత జరుగుతున్నా మరోసారి వేణుస్వామి ఎక్కడైనా జాతకాలు చెబుతూ కనపడితే పట్టుకురండ్రా అంటూ బీఆర్ఎస్ కు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆయన మరో వీడియోతో ప్రజల ముందుకు వస్తారా? లేదంటే కొంతకాలం సైలెంటవుతారా? అనేది వేచిచూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications