కేసీఆర్ ఘోర పరాజయం: మూడో స్థానానికి పడిపోయిన సీఎం- రేవంత్ సైతం: జెయింట్ కిల్లర్..!!
KCR loses: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైన ఈ కౌంటింగ్‌లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టే- అవి అంచనా వేసినట్టే- కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. భారత్ రాష్ట్ర సమితి కంచుకోటలను సైతం తుక్కు తుక్కు చేసింది. తొలి రౌండ్ నుంచే హస్తం పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి సహా పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. కొడంగల్‌లో రేవంత్ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, భారత్ రాష్ట్ర సమితికి చెందిన పట్నం నరేందర్ రెడ్డిని మట్టికరిపించారు. అశ్వారావుపేట, రామగుండంలల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆదినారాయణ, రాజ్ ఠాకూర్ గెలుపొందారు. పలు నియోజకవర్గాల్లో ఆధిక్యతలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు.
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఘన విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. విజయఢంకా మోగించారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కేసీఆర్ కేబినెట్‌లోని ఆరుమంది మంత్రులు మట్టికరిచారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఘోరంగా ఓడిపోయారు. కామారెడ్డిలో మట్టికరిచారు. తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన కే వెంకటరమణ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక్కడ కేసీఆర్‌పై పోటీ చేసిన రేవంత్ రెడ్డి సైతం ఓడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కామారెడ్డిలో కేసీఆర్ మూడో స్థానంలో నిలిచారు. రేవంత్ రెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. వీరిద్దరిని ఓడించిన వెంకటరమణా రెడ్డి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. గజ్వేల్‌లో మాత్రం కేసీఆర్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బీజేపీకి చెందిన ఈటల రాజేందర్‌పై ఆయన పైచేయి సాధించారు.












Click it and Unblock the Notifications