మద్యం ధరలు భారీగా పెంపు -బ్రాండ్లు.. కొత్త రేట్లు ఇలా..!!
మందుబాబులకు షాకింగ్ న్యూస్. కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నట్లుగానే మద్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త ధరలు ఫిక్స్ అయ్యాయి. ఫుల్ బాటిల్ ధర దాదాపు రూ 80 వరకు పెరగనుంది. ప్రీమియం బ్రాండ్లు రూ 120 వరకు పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికం గా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. పెరిగిన ధరలు ఈ నెల 15వ తేదీ నుంచి అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. బ్రాండ్ల వారీగా ధరలను ఫిక్స్ చేసారు.
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. కొంత కాలంగా రాష్ట్రం లో మద్యం ధరల పెంపు పైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ కొత్త ధరల పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. లిక్కర్ తయారీ కంపెనీల ఒత్తిడి మేరకు మద్యం ధరలను భారీగా పెంచేందుకు చర్యలు మొదలయ్యాయి. తాజా ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత.. ఈ నెల 15వ తేదీ నుంచి పెంచిన మద్యం రేట్లు అమల్లోకి తెచ్చే విధంగా రంగం సిద్దం అవుతోంది. ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో మద్యం ధరలను కూడా పెంచాలని లిక్కర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరుతున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరలను ఎంతమేర పెంచాలన్న దానిపై ప్రభుత్వం ఏప్రిల్ నెలలో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ మూడు రోజులుగా మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది.

ఈ నెల 15 నుంచి కొత్త ధరల అమలు
కమిటీ చర్చలు పూర్తి కావటంతో ధరల పైన ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. మద్యం ధరలను 10శాతం నుంచి 15శాతం మధ్యలో పెంచాలని కంపెనీలు త్రిసభ్య కమిటీ సభ్యులకు విన్నవించాయి. మద్యం కంపెనీలు పేర్కొన్న ప్రకారం.. ఒక్కో ఫుల్ బాటిల్ పై గరిష్ఠంగా రూ.80 వరకు పెరిగే అవకాశం ఉందని, ప్రీమియం బ్రాండ్లు అయితే రూ.90దాకా పెరిగే అవకాశం ఉందని, కాస్ట్లీ బ్రాండ్లు (హై-ఎండ్) అయితే రూ.120పైనే పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తన నిర్ణయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమై చర్చించిన తరువాత ధరల పెంపు ఫైల్ ను రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈనెల 15 నుంచి పెంచే ధరలు అమల్లోకి తీసుకొచ్చే విధంగా కసరత్తు జరుగుతోంది. అయితే, గతేడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలు పెంచిన నేపథ్యంలో ఈసారి బీర్ల ధర పెంపుకు అనుమతి లభించలేదు. ఈ కొత్త ధరల పైన ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.













Click it and Unblock the Notifications