పంటల కోసం ఫోన్ లలో రైతుల పాట్లు.. ఎందుకంటే!
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు పడకుండా ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులు ఇళ్ళ నుండి నేరుగా యూరియాను బుక్ చేసుకునేలాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఎరువుల కొనుగోలుకు యాప్.. కానీ రైతులలో ఆందోళన
ఈ యాప్ ను నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ యాప్ వినియోగం రైతులను గందరగోళానికి గురి చేస్తుంది. ఇక ఎవరైనా సరే యూరియా కావాలనుకునే రైతులు ఎరువుల డీలర్ల వద్దకు, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్తున్నా యాప్ వినియోగం అర్ధం కాక రైతులు గందరగోళానికి గురవుతున్నారు.

రైతులకు యాప్ వినియోగం నేర్పాలని విజ్ఞప్తి
ఈ యాప్ వినియోగంపై రైతులకు ట్రైనింగ్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఏ మాత్రం చదువుకోని రైతులకు ఈ యాప్ వినియోగం కష్టమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ యాప్ ద్వారా తమ దగ్గరలోని జిల్లాలోని ఎరువుల డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ ఎంతుందో తెలుసుకోవచ్చు. వారికి అవసరమైన యూరియాను ముందుగా బుక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చని చెప్తుంది.
పత్తి కొనుగోలు యాప్ తో గందరగోళం.. మళ్ళీ ఎరువులకు యాప్
అయితే ఇంతకు ముందు పత్తి కొనుగోలు కోసం తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్ కూడా రైతులను గందరగోళానికి గురి చేసింది. ఇప్పుడు మళ్ళీ యూరియా కోసం యాప్ తీసుకు రావటం మంచిదే అయినా దానిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులకు ఉందని రైతుల నుండి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే అధికారులు యూరియా బుకింగ్ కోసం వ్యవసాయ విస్తరణ అధికారి సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు.
బుకింగ్ ఈజీ ఏం కాదని అభిప్రాయం
ఈ యాప్ లో బుకింగ్ కూడా అంత సులువుగా లేదని రైతుల అభిప్రాయం.. బుకింగ్ సమయంలో రైతులు సీజన్, పాస్ బుక్ వివరాలు, పంట రకాలు, సాగు విస్తీర్ణం ఎంత ఉంది అనే వివరాలను యాప్ లో నమోదు చేయాలి. ఈ సమాచారం ఆధారంగా రైతుకు అవసరమైన యూరియా పరిమాణాన్ని తెలియజేస్తూ దానిని ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు అనేది యాప్స్ స్వయంగా లెక్కించి చెబుతుంది.
బుకింగ్ పూర్తయ్యాక రైతులు చెయ్యాల్సిన పని ఇదే
ఇక యాప్ ద్వారా యూరియా బుకింగ్ పూర్తి అయిన తర్వాత కూడా పెద్ద పనే ఉంది. రైతుకు దానికి సంబంధించి ఒక బుకింగ్ ఐడి వస్తుంది. దీని ఆధారంగా ఎంపిక చేసిన డీలర్ నుంచి వీరు యూరియాను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక డీలర్లు నుండి లేదా రైతు ప్రతినిధి వద్ద నుండి బుకింగ్ ఐడిని, పరిమాణాన్ని ధృవీకరించు కున్న తర్వాత యూరియాను విక్రయించాల్సి ఉంటుంది.
యాప్ ను రైతులు అర్ధం చేసుకోవటానికి సమయం
రైతులు సాగు చేసే పంట రకం తో పాటు, సాగు విస్తీర్ణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని యూరియా బస్తాలను రైతులకు అందిస్తారు. ఈ యూరియా బస్తాలు 15 రోజుల వ్యవధితో ఒకటి నుండి నాలుగు దశలలో అందజేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో రైతులకు ఏవైనా సమస్యలు వస్తే, వాటిని పరిష్కరించడం కోసం వ్యవసాయ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ ప్రాసెస్ అంతా రైతులు అర్ధం చేసుకోవటానికి సమయం పడుతుంది.
యాప్ పై రైతులకు శిక్షణ అవసరం
ఈ యాప్ లో మన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటిపి ద్వారా లాగిన్ చేసుకునే వీలు ఉంటుంది. డీలర్లు తమ లాగిన్ లో రోజువారి స్టాక్ ను అమ్మకాలను నమోదు చేస్తారు. కాబట్టి ప్రతి డేటా రైతులకు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో యూరియా లభ్యత వివరాలు, కౌలు రైతులకు ఆధార్ ద్వారా బుకింగ్ సౌకర్యం వంటి అన్ని వివరాలు యాప్ లో తెలుసుకోవచ్చు. రైతుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ఎరువులు కొనుగోలులో పారదర్శకతను పెంచడానికి, ఎక్కువ ఎరువులు రైతులు తీసుకువెళ్ళకుండా నియంత్రించడానికి ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ రైతులకు దీనిపై శిక్షణ అవసరం.












Click it and Unblock the Notifications