Telangana: పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై పోరు.. రాష్ట్ర సర్కారు నిర్ణయం
Telangana:వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) సీట్లలో స్థానిక కోటా రద్దుపై పోరాటం చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించుకుంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఉన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాజ్యాంగ ధర్మాసనం వద్దకు వెళ్లడంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్థానిక విద్యార్థులకు తీవ్ర నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దక్షిణాదిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రానికి పీజీ మెడికల్ సీట్ల కోటా రద్దుపై లెటర్ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటల రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ఈ అంశం ప్రస్తావించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎంబీబీఎస్ లో స్థానిక కోటా కింద రాష్ట్రంలో అర్హత పొందిన వారే.. పీజీలో స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులు అవుతారని రాష్ట్ర సర్కారు జీవో148, 149లను తీసుకువచ్చింది. ఇతర రాష్ట్రాల వారు రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన పీజీ స్థానిక కోటా వర్తించదని ఆ జీవోలో పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు స్థానిక కోటా కింద పీజీ ప్రవేశాల్లో ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి. తాజాగా స్థానిక కోటాను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీట్లన్నీ ఆలిండియా కోటాలోకి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నస్థానిక విద్యార్థులకు సీట్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్/బీఏఎంఎస్ చేసిన వారికి పీజీలో స్థానిక కోటా పరిధిలోనే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని తెలంగాణ సర్కారు పేర్కొంది. తెలంగాణ స్థానికులై ఉండి రాష్ట్రంలోనే ఎంబీబీఎస్, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పీజీ ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని అధికారులుల చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని పేర్కొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 13 వేల మందికి ఒక పీజీ స్టూడెంట్ సేవలు అందిస్తుండగా.. ఉత్తరాదిలో అంతకు మూడింతల మందికి ఒక పీజీ స్టూడెంట్ సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో కాలేజీల సంఖ్య పెరిగిపోయింది.
2014 వరకు 5గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ఇప్పుడు పెరిగి 34కు చేరింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. 2025 నాటికి రాష్ట్రంలో 2,924 పీజీ సీట్లు అందుబాటులో ఉంటే అందులో 50 శాతం స్థానిక కోటా రిజర్వేషన్ ప్రకారం 1,462 పీజీ సీట్లు రాష్ట్రంలోని విద్యార్థులకు మాత్రమే రాగా.. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 1462 సీట్లు కూడా ఆలిండియా కోటాలోకి వెళ్లిపోనున్నాయి. ఈ నిర్ణయంతో ఆయా రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు దెబ్బతింటాయని అధికారులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications