డీఎస్పీగా పంక్చర్ షాపు యజమాని కూతురు.. కోచింగ్ లేకుండానే !!
"శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ సొంతమవుతుంది" అనే మాటను మరోసారి నిరూపించింది తెలంగాణ బిడ్డ మౌనిక. పేదింటిలో పుట్టినా.. చిన్నప్పటి నుంచి కష్టాలు వెంటాడినా.. చదువు అనే దీపాన్ని ఆరిపోనీయకుండా పట్టుదలతో ముందుకు సాగి.. ఎలాంటి కోచింగ్ లేకుండానే రాష్ట్ర అత్యున్నత సర్వీసు అయిన గ్రూప్-1 పరీక్షలో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించింది. ఆమె తండ్రి పంక్చర్ షాపు నిర్వహిస్తుండగా.. కూతురు ఈ రకంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేలా సక్సెస్ అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
చిన్నప్పటి నుంచే కష్టాల మధ్య జీవితం..
ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక జీవితం చిన్నప్పటి నుంచే కష్టాలతో నిండిపోయింది. తల్లి సరోజ కూలీ పనులు చేస్తూ.. తండ్రి సమ్మయ్య ఒక చిన్న పంక్చర్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. రోజంతా చెమటోడ్చినా, ఇంట్లో పేదరికం తగ్గేది కాదు. అయినా కూతురు చదువు ఆగకూడదని ఇద్దరూ త్యాగాలు చేశారు. అదే తల్లిదండ్రుల కలలు మౌనికకు శక్తి ఇచ్చాయి.

చదువే ఆయుధం & క్రమశిక్షణే మార్గం..
2020లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. మౌనిక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేక కోచింగ్ సెంటర్‌కు వెళ్లే అవకాశం లేకపోయినా.. దానిని అడ్డంకిగా కాకుండా అవకాశంగా మార్చుకుంది. ఇంట్లోనే స్వీయ అధ్యయనం చేస్తూ.. రోజుకు 12 గంటలకు పైగా చదివింది. క్రమం తప్పకుండా టెస్ట్ పేపర్లు రాసి.. తప్పులను సరిదిద్దుకుంటూ తన ప్రిపరేషన్ మెరుగుపరుచుకుంది. కష్టాలు ఎన్ని ఎదురైనా, తన లక్ష్యాన్ని ఒక్క క్షణం కూడా వదల్లేదు.
మొత్తానికి తన శ్రమకు ఫలితం దక్కి.. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక 315వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికైంది. ఒకప్పుడు తల్లిదండ్రులు చెమటోడ్చి నడిపిన చిన్న పంక్చర్ షాప్ ముందు, ఈ రోజు డీఎస్పీగా నిలబడ్డ కూతురి విజయాన్ని చూసి వారు కన్నీటి పర్యంతం అవుతూ ఎమోషనల్ అవుతున్నారు. మౌనిక విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాదని.. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాల అనేక యువతకు స్ఫూర్తిగా ఉంటుందని పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా రేవలి మండలంలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన మండ్ల కవిత కూడా గ్రూప్-1 పరీక్షలో అద్భుత విజయాన్ని సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కవిత.. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు సాగి ఈ స్థాయికి చేరుకుంది. కవిత తండ్రి మండ్ల నాగన్న డ్రైవర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. ఆమె తల్లి భారతమ్మ వ్యవసాయ కూలీగా కష్టపడి పిల్లలకు విద్యనందించారు. ఈమె కూడా క్రమశిక్షణతో చదువుతూ తన కలను సాకారం చేసుకుంది.












Click it and Unblock the Notifications