గంజాయి పండిస్తే ఇట్టే తెలిసిపోతుంది.. తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం
శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత భవిష్యత్తును కాపాడటానికి డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధాన్ని ప్రకటించారు. తెలంగాణ గొప్ప చరిత్రను, నిజాంలు, రాజ్యాధికారులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ, అదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన యువత డ్రగ్స్ బారిన పడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే... తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని హెచ్చరించామ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు. దేశ జనాభాలో 68 శాతం యువత ఉండటం, ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న ఏకైక దేశం భారతదేశం అని గుర్తు చేశారు. శత్రు దేశాలు డ్రగ్స్ ద్వారా మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని, పంజాబ్‌లో యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలై నిర్వీర్యమైన తీరును ఉదహరించారు. తెలంగాణలో యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు.

తెలంగాణలో గతంలో క్రీడా విధానం లేదని, తాము అధికారంలోకి రాగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. తన ప్రస్థానాన్ని, విజయ్ దేవరకొండ ప్రస్థానాన్ని ఉదాహరిస్తూ, కష్టం, కమిట్‌మెంట్ లేకుండా ఉన్నత స్థాయికి ఎదగలేరని అన్నారు. "మాదక ద్రవ్యాల నియంత్రణకు కలిసికట్టుగా ముందుకు రండి, నో డ్రగ్స్ కు మీరే వారధులుగా మారండని యువతకు పిలుపునిచ్చారు.
పాఠశాలలు, కళాశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలని, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిదేనని హెచ్చరించారు. అందరం అప్రమత్తంగా ఉంటేనే మాదక ద్రవ్యాలను నియంత్రించగలమని స్పష్టం చేశారు. ఉద్యమాల గడ్డ తెలంగాణ గంజాయి, డ్రగ్స్ కు వేదిక కావద్దని కోరారు. మీరు మేము మనం కలిస్తేనే ప్రపంచానికే ఆదర్శవంతంగా తెలంగాణను తీర్చిదిద్దగలుగుతామని రేవంత్ రెడ్డి దృఢంగా చెప్పారు.
కొత్త దళం 'EAGLE' రంగ ప్రవేశం:
ముఖ్యంగా, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం TGNAB (Telangana Anti-Narcotics Bureau) ఇక నుంచి EAGLE (ELITE ACTION GROUP FOR DRUG LAW ENFORCEMENT) గా మారనుందని ప్రకటించారు. ఈ EAGLE తెలంగాణలో ఎక్కడ గంజాయి పండించినా, అక్రమ రవాణా జరిగినా సరిహద్దుల్లోనే పసిగడుతుందని వివరించారు. చివరిగా, యువత చదువు, స్పోర్ట్స్ లో రాణించి హీరోలుగా నిలవాలని, రాబోయే రోజుల్లో ఉద్యోగాల్లోనే కాదు రాజకీయాల్లోనూ స్పోర్ట్స్ పర్సన్స్ కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications