అర్హులు కొత్త రేషన్ కార్డులు అందుకునే తేదీ వెల్లడి: మార్గదర్శకాలు విడుదల
New Ration Cards in Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- కొత్త రేషన్ కార్డులను జారీ చేసే దిశగా నిర్ణయాన్ని తీసుకుంది. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త వినిపించింది.
కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి ఉద్దేశించిన విధి విధానాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన ఉత్తర్వులు తెలుగులో విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కమిషనర్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.

రేషన్ కార్డులపై చాలాకాలంగా అపరిష్కృతంగా ఉంటూ వస్తోన్న విజ్ఞప్తులను పరిష్కరించే దిశగా ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హత ప్రమాణాలు, విధి విధానాలను పరిశీలించడానికి, దీనికి సంబంధించిన సిఫారసులను అందజేయడానికి ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులను ఈ నెల 4వ తేదీన ఏర్పాటైన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించింది కూడా. సంక్రాంతి పండగను పురస్కరించుకుని తాజాగా దీన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
1. కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి జిల్లా కలెక్టర్లు/గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిఫనర్‌కు పంపిస్తారు.
2. మండల స్థాయిలో ఎంపీడీఓ/ పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్‌కు ఈ జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది.
3. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)/ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.
4. ముసాయిదా జాబితాను గ్రామ సభ, వార్డు సభల్లో ప్రదర్శిస్తారు. అందులో పొందుపరిచిన వివరాలను చదివి వినిపిస్తారు. దీనిపై చర్చించిన తరువాత ఆమోదిస్తారు.
5. గ్రామ లేదా వార్డు సభల్లో ఆమోదం పొందిన లబ్దిదారుల అర్హత జాబితాను మండలం/మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్/జీహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్‌కు పంపించాల్సి ఉంటుంది.
6. ఈ జాబితా పట్ల జిల్లా కలెక్టర్/జీహెచ్ఎంసీ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేస్తే పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్‌కు పంపిస్తారు.
7. ఇది తుది జాబితా అవుతుంది. దీని ఆధారంగానే పౌర సరఫరాల శాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు.
8. అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటారు అధికారులు.
9. రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపు చర్యలను సంబంధిత అధికారులు చేపడతారు.
10. అర్హత ఉన్న వారికి ఈ నెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అందుతాయి.












Click it and Unblock the Notifications