బంగాళాదుంపకు భారీ డిమాండ్: కాసులు కురిపిస్తోన్న తెలంగాణ ఆలుగడ్డ, కానీ..
హైదరాబాద్: ఏ విందు కార్యక్రమమైనా ఆలుగడ్డలు లేదా బంగాళాదుంపలు లేకుండా జరగదు. ప్రజలు కూడా వారంలో ఒకసారైనా ఆలుగడ్డ కూరలేకుండా వంట ఉండదు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ ఆలుగడ్డకు డిమాండ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. అధిక డిమాండ్ తోపాటు కాసులు కురిపిస్తుండటంతో రాష్ట్ర రైతులు కూడా బంగాళాదుంపను ఎక్కువగానే పండిస్తున్నారు. అయినప్పటికీ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేకపోవడం గమనార్హం.
తెలంగాణలో 2.04 లక్షల మెట్రిక్ టన్నుల ఆలుగడ్డల డిమాండ్ ఉండగా.. కేవలం 32,747 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ప్రస్తుతం బంగాళాదుంప విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం సెంట్రలో పొటాటో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీపీఆర్ఐ), సిమ్లా, ఆగ్రా, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని కొంతమంది వ్యాపారుల నుంచి సేకరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను సేకరించడం ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారింది. రవాణా ఖర్చులు భారీగా అవుతుండటంతో ఈ ఖర్చులను రైతులపై మోపుతోంది. దీంతో బంగాళాదుంప సాగు చేసే రైతులకు ఉత్పత్తి వ్యయం 40-50 శాతం వరకు పెరుగుతోంది.

ఈ క్రమంలో విత్తన సమస్యలను పరిష్కరించడానికి తెలంగాన ఉద్యానవన శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నాణ్యమైన బంగాళాదుంప విత్తనాలను తక్కువ ధరలకే ఉత్పత్తి చేయడానికి ఎపికల్ రూటెడ్ కటింగ్(ఏఆర్‌సీ) విత్తన సాంకేతికతను అనుసరించాలని యోచిస్తోంది. దీని కోసం కొంత మంది రైతులతోపాటు 15 మంది సభ్యుల బృందాన్ని బెంగళూరులోని ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్(సీఐపీ), యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ అధ్యయనానికి పంపింది. అక్కడే వివిధ నర్సరీలు, టిష్యూ కల్చర్ ల్యాబ్, ఫీల్డ్ లను సందర్శించిన తర్వాత ఈ బృందం రాష్ట్రంలో ఏఆర్సీ సాంకేతికతను ప్రోత్సహించడానికి కార్యాచరణ రూపొందించింది.
ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ హార్టీకల్చర్ సైన్సెస్ లో ఏఆర్సీ ద్వారా ఉత్పత్తి చేసిన విత్తనాలను ఈ వానాకాలంలో రైతులకు ఉచితంగా సరఫరా చేయనుంది. దీంతో రైతులకు పెద్ద మొత్తంలో ఉత్పత్తి వ్యయం తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, జీడిమెట్ల, ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బంగాళాదుంప ఎపికల్ రూటెడ్ కటింగ్ కోసం ప్రత్యేకమైన విభాగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విభాగం నుంచి ఉత్పత్తి చేయబడిన ఆలుగడ్డ విత్తనాలను సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట రైతులకు రబీ పంట సీజన్లో సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications