మరోసారి భూముల వేలానికి సిద్ధమైన ప్రభుత్వం.. ఎకరా రూ.101 కోట్లే!
రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా విలువైన భూముల వేలానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపగా.. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TGIIC) ఓ ప్రకటన విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదాపూర్‌లో భూములను విక్రయించిన తర్వాత.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అత్యంత విలువైన భూములను వేలం వేయాలని నిర్ణయించింది.
రాయదుర్గంలో భారీ వేలం శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గం పాన్ మక్త గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న మొత్తం 18.67 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ భూమిని ఎకరాకు రూ.101 కోట్లు చొప్పున విక్రయించనున్నట్లు టీజీఐఐసీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ అంచనా ధరతో ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1,900 కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా. ఒకవేళ వేలంలో పోటీ పెరిగితే, ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.

గతంలో విమర్శించిన కాంగ్రెస్.. మరి ఇప్పుడు?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల అమ్మకాలపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, భూములను అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరించడంపై ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇది రాజకీయంగా విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణ సర్కారు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు(KPHB)కి చెందిన 7.8 ఎకరాల భూమిని ఈ-వేలం ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. ఎకరా రూ.70 కోట్లు పలకగా.. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆ భూమిని కొనుగోలు చేసింది. కేపీహెచ్‌బీ భూముల ద్వారా ప్రభుత్వ ఖజానాలో రూ.547 కోట్లు వచ్చి చేరాయి. ఈ భూముల కోసం గోద్రేజ్ ప్రాపర్టీస్‌తో పాటు అరబిందో రియల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అశోక బిల్డర్ వంటి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు పోటీపడిన విషయం తెలిసిందే. ఎకరాకు రూ.40 కోట్లను కనీస ధరగా నిర్ణయించగా.. గోద్రెజ్ అత్యధిక ధరతో బిడ్ దాఖలు చేసింది. అంతకుముందు కూడా భూముల వేలం ద్వారా తెలంగాణ సర్కారుకు భారీ ఆదాయం వచ్చింది.












Click it and Unblock the Notifications