TS 10th Exams: తెలంగాణలో పదోతరగతి పరీక్షల రీషెడ్యూల్ ? ఎప్పుడంటే ?
తెలంగాణలో పదో తరగతి పరీక్షల రీషెడ్యూల్ తప్పేలా లేదు. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమీక్షకు సిద్ధమయ్యారు. అనంతరం విద్యాశాఖ ఈసారి పదో తరగతి పరీక్షల తేదీలపై కీలక ప్రకటన చేయబోతోంది. తాజా అంచనాల ప్రకారం వచ్చే ఏడాది మార్చి రెండు లేదా మూడో వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశముంది.
తెలంగాణలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇవాళ విద్యాశాఖ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరిలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో పాటు పదో తరగతి బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, ఇతర అధికారులున్నారు. ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వీరు సుదీర్ఘంగా చర్చించారు.

ఇవాళ్టి భేటీలో చర్చించిన అంశాలపై రేపు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ పై విద్యాశాఖ అధికారులతో రేపు నిర్వహించే ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పదో తరగతి పరీక్షల తేదీలపై కీలక సూచనలు చేయనున్నారు. అలాగే విద్యాశాఖ అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని తుది నిర్ణయం ప్రకటిస్తారు. దీంతో రేపు సీఎం రేవంత్ తో భేటీ తర్వాత పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల కానుంది.
ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో లీకులు, ఇతర అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్షలోనూ అధికారులకు పలు సూచనలు చేశారు. రేపు భేటీలోనూ దీనిపై ప్రస్తావించే అవకాశం ఉంది. సీఎంతో భేటీ తర్వాత మార్చి రెండు లేదా మూడో వారంలో టెన్త్ పరీక్షల నిర్వహణపై బోర్డు ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications