నోటిఫికేషన్ల జాతర, 20 వేల పోస్టుల భర్తీకి ఆమోదం - ఏ శాఖలో ఎన్ని ఖాళీలు..!!
తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఇప్పటి కే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు వెలువడంతో మిగతా విభాగాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వం 60,000 పైగా నియామకాలు పూర్తిచేసింది. ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలను గుర్తించగా 20,000 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో.. ఇక నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం పలు శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్ణయించింది. ఉద్యోగ ప్రకటనలకు కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తికావడం, పెండింగ్ నియామకాలన్నీ ముగియడంతో సంబంధిత విభాగాలు వర్గీకరణ రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు గుర్తిస్తున్నాయి. టీజీపీఎస్సీ గురుకుల, పోలీస్ నియామక బోర్డులు కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైన పరిపాలన ప్రక్రియను ప్రారంభించాయి. ఉద్యోగ క్యాలెండర్‌ను రూపొందించి, ఆ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైన ఆర్థికశాఖ అనుమతులు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు, ఉద్యోగుల సర్దుబాటు, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి పొందిన పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలిస్తోంది.

కాగా, ఈ పరిశీలనలో పోలీస్, వైద్య, విద్యుత్, టీజీపీఎస్సీ నియామకాలు ఉన్నాయి. ఇటీవల నియామకాలు పూర్తైన వాటిలో బ్యాక్‌లాగ్ ఖాళీలు దాదాపు 4,000కు పైగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క గురుకుల నియామక బోర్డు పరిధిలోనే దాదాపు 2 వేల వరకు ఉంటాయని అంచనా. గ్రూప్-4లోనూ కొన్ని ఖాళీగా ఉన్నాయి. తాజాగా 20,000 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. జాబ్‌క్యాలెండర్‌లో పేర్కొన్న కేటగిరీలవారీగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియ చేపట్టింది. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 2,000 నుంచి 3,000 వరకు ఖాళీలున్నట్లు సమాచారం. అధిక పోస్టులు పోలీస్ విభాగంలో ఉన్నట్లు తెలిసింది. ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో 12,452 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సివిల్ విభాగంలో అత్యధికంగా 8,442 పోస్టులున్నాయి. దీంతో.. ఇప్పుడు వీటి భర్తీ దిశగా త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications