ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా రెండో విడత నిధుల కోసం రైతులు వేచి చూస్తున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ప్రభుత్వం ఈ నెలలో తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. రెండు, మూడో విడత కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఇదే సమయం లో ధాన్యం సేకరణ నిధుల జమ పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ధాన్యం సేకరణ డబ్బులు వారం రోజుల్లోనే జమ చేస్తామని ప్రకటించింది.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం సేకరణ నిధులను వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, అమ్మిన తర్వాత రైతులకు వారం రోజుల్లో డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పారు. ఇక సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ డబ్బులు అందిస్తామని స్పష్టం చేసారు. ఈ నిధుల కోసం రైతులు ఇక నుంచి నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.80 లక్షల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, ధరణి పోర్టల్ కారణంగా చాలా మంది రైతులు నష్టపోయారని..అందులో లొసుగులు కారణంగా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు.

రైతు భరోసా రెండో విడత నిధుల పైనా క్లారిటీ
ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చి ల్యాండ్ రికార్డుల్లో పారదర్శకత తెచ్చి రైతుల కు మేలు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని పొంగులేటి చెప్పుకొచ్చారు. రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేలు చొప్పున అందిస్తూ పెట్టుబడి సాయం అందిస్తున్నామని గుర్తు చేసారు. రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేశామని, ఈ నెలాఖరుల్లోగా అన్ని ఎకరాలకు అందిస్తామని పొంగులేటి చెప్పారు. తమ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందన్న పొంగులేటి.. ఎవరికి భయపడమని అన్నారు. సన్న వడ్లకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా రూ.500 బోనస్ కూడా ఇస్తున్నామన్నారు. సన్న వడ్లను రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్నామని, ఇతర ప్రాంతాలకు పంపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications