హైదరాబాద్ లో సర్వాంగ సుందరంగా..: రూ.375 కోట్లను మంజూరు చేసిన రేవంత్ రెడ్డి
భారీ వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాద్ అతలాకుతలమౌతో వస్తోంది. రోడ్లన్నీ నదులను తలపించడం ఆనవాయితీగా మారుతోంది. వాహనాల రాకపోకలు గంటల కొద్దీ స్తంభించిపోవడం, జనజీవనం అస్తవ్యస్తం కావడం, నగరం మొత్తం నరకప్రాయంగా తయారుకావడం సర్వసాధారణంగా మారుతోంది.
ఈ పరిస్థితులకు చెక్ పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. వరదలను తట్టుకోవడానికి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఒక్కటే ఆధారమని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా వరద నీటిని మూసీనదిలోకి మళ్లించవచ్చని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురి కాకుండా ఉంటాయని ఆయన గతంలో వెల్లడించారు కూడా.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు అప్పట్లో. వందేళ్ల పాటు హైదరాబాద్ లో వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని తేల్చి చెప్పారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేసి ఆ దిశగా పనులు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువులతో పాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు.
తాజాగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం 375 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది రెండో విడత మొత్తం. ముసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ముసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) కు ఈ మొత్తాన్ని మంజూరు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో మూసీ రివర్ ఫ్రంట్ కోసం 1,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో రెండో త్రైమాసికం కింద 375 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. మూసీ సుందరీకరణ, కాలుష్య నియంత్రణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులను చేపడతారు.
సుందరీకరణలో భాగంగా పార్కులు, వాకింగ్- సైక్లింగ్ ట్రాక్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, వరదలను నివారించడానికి కట్టల నిర్మాణం, నదీ తీరం వెంబడి సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన వేదికల నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications