రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. వారికి ఒక్క పూట మాత్రమే పని
తెలంగాణలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు రాష్ట్రంలోని ఉద్యోగులు, కార్మికులు సైతం ఎండలో విధులు నిర్వర్తించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణలోని పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.
ఎండల్లో విధులు నిర్వర్తించడంలో గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్క పూట విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని.. మండుటెండలో విధులు నిర్వర్తించడం కష్టంగా ఉందని కార్మిక సంఘాలు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాయి. తీవ్రమైన వేసవి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్క పూట విధులకు అనుమతించాలని కోరాయి. అయితే కార్మిక సంఘాల విజ్ఞప్తిని దృష్టిలోకి తీసుకున్న ప్రభుత్వం.. వాతావరణ పరిస్థితులను బట్టి పని సమయాలు సర్దుబాటు చేయాలని సూచించింది.
ప్రస్తుతం తెలంగాణలోని పంచాయతీల్లో దాదాపు 50-60 వేలకు పైగా ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. వీరు గ్రామ పంచాయతీలో అనేక రకాల విధులు నిర్వహిస్తారు. గ్రామంలో వీధులు శుభ్రం చేయటం, చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించడం, డ్రైనేజీలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లడం వంటి పనులు చేస్తారు. నీటి ట్యాంకర్లు, ట్రాక్టర్లు నడపడం, నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడం, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కలకు నీరు పోయడం, ఇంటి పన్ను, ఇతర పన్నుల బిల్లులు వసూలు చేయటం చేస్తారు.
పంచాయతీల్లోని మల్టీ పర్పస్ వర్కర్లు ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీతాలు టైమ్ కు పడక నానా ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్కరిపై పని భారం ఎక్కువగా ఉంటోంది. చాలా మంది కార్మికులు ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ వారిని రెగ్యులర్ చేయలేదు.












Click it and Unblock the Notifications