రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా పైలట్ ట్రైనింగ్.. అమ్మాయిలు అస్సలు మిస్ కాకండి
ఆడపిల్లల ఆశయాలకు సరికొత్త రెక్కలు తొడిగేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పైలట్ కావడం అనేది ఒక నెరవేరని కలగానే ఉండిపోతుంది. కోట్లతో కూడుకున్న ఈ ఖరీదైన కోర్సును ఎంతోమంది చదువుకోవాలనుకున్నా, ఆర్థిక పరిస్థితులు వెనక్కి గుంజుతాయి. కానీ ఇకపై ఆ పరిస్థితి మారనుంది! ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న అర్హులైన యువతులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పైలట్ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

త్రిపక్ష ఒప్పందంతో సరికొత్త చరిత్ర
యువతులకు వైమానిక రంగంలో మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో రీచ్'ల మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. 'గివింగ్ వింగ్స్ టు ఫ్లై' అనే ప్రత్యేక కార్యక్రమం కింద ఈ ఉచిత ట్రైనింగ్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ప్రతిభ కలిగిన అమ్మాయిలను ఎంపిక చేసి, వారిని ప్రొఫెషనల్ పైలట్లుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
20 నెలల సమగ్ర శిక్షణ.. పూర్తి ఉచితం!
ఈ ప్రాజెక్ట్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏకంగా 20 నెలల పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తారు. ఇందులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణతో పాటు ATR టైప్ రేటింగ్ కోర్సును ఉచితంగా అందజేస్తారు. అంతేకాకుండా, ఈ శిక్షణా కాలంలో విద్యార్థినులకు అయ్యే వసతి, భోజనం , మెడికల్ ఇన్సూరెన్స్ ఖర్చులను ఉచితంగానే కల్పిస్తున్నారు. సీనియర్ పైలట్లు, నిపుణులైన సీనియర్ మెంటార్ల పర్యవేక్షణలో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అందనుంది.
దరఖాస్తు విధానం ఇలా..
ఇంటర్మీడియట్ పూర్తయి, వైమానిక రంగంలో స్థిరపడాలనే ఆసక్తి, అర్హత ఉన్న యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు indigoreachgwf.scholarsbox.in అనే అధికారిక పోర్టల్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కలలను నిజం చేసుకోవాలని కోరుతున్నారు.




Click it and Unblock the Notifications