ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక- బకాయిలు, ఉత్తర్వులు..!!
ప్రభుత్వం దసరా వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డీఏల బకాయిల చెల్లింపు పైన ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేళ్ల ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి, జులై డీఏలను సర్కారు విడుదల చేసింది. రెండు డీఏలు కలిపి 6.27 శాతం పెరిగింది. దీనిని అక్టోబరు జీతంతో కలిపి ఉద్యోగు జీపీఎఫ్ ఖతాల్లో జమ చేయనుంది. సీపీఎస్ ఉద్యోగులకు మొదటి డీఏ 33, రెండో కరవు భత్యాన్ని 27 వాయిదాల్లో చెల్లించనున్నారు.
ఉద్యోగులతో జరిగిన చర్చల ఫలితంగా ఇటీవల మంత్రివర్గ భేటీలో రెండు డీఏల చెల్లింపు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు డీఏల చెల్లింపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు 2వేల500 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జనవరి 2024 నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచింది. అలాగే జూలై 2024 నుంచి డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 2015 పే స్కేల్ ఉద్యోగులకు కూడా డీఏను 73.344 శాతం నుంచి 78.06 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 2024 నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి, 2020 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచింది.

ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేళ్ల ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి, జూలై 2024 నుంచి డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచింది. అలాగే 2006 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 230 శాతం నుంచి 239 శాతానికి, జూలై 2024 నుంచి 239 శాతం నుంచి 246 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏను అక్టోబర్ 2026 జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 33 వాయిదాల్లో ప్రభుత్వం చెల్లించనుంది. అదే విధంగా జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లింపులు జరుపనుంది. డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
