గద్దర్‌పై అభిమానాన్ని చాటుకున్న రేవంత్ రెడ్డి: తెల్లాపూర్ వద్ద..!!
Gaddar: ప్రజా యుద్ధనౌకగా గుర్తింపు పొందిన దివంగత విప్లవ గీత రచయిత, గాయకుడు గద్దర్‌కు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘన నివాళి అర్పించనుంది. గద్దర్ భారీ విగ్రహాన్ని నెలకొల్పనుంది. ఆయన పేరు మీద స్మృతి వనాన్ని తీర్చిదిద్దనుంది. దీనికి అవసరమైన అనుమతులను జారీ చేసింది.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్దర్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. తన ఆటపాటలతో ఉత్తేజితులను చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై కొంతమేరకైనా ప్రజల్లో వ్యతిరేకతను తీసుకుని రాగలిగారు. ఖమ్మం సహా పలు చోట్ల కాంగ్రెస్ నిర్వహించిన జన గర్జనల్లో ఆయనే హైలైట్‌గా నిలిచారు.

అసెంబ్లీ ఎన్నికులకు కొద్ది రోజుల ముందు అంటే ఆగస్టు 6వ తేదీన ఆయన కన్నుమూశారు. 74 సంవత్సరాల వయస్సులో గుండె సంబంధిత ఇబ్బందులతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చివరి వరకూ ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు.
ప్రస్తుతం ఆయన కుమార్తె డాక్టర్ వెన్నెల గద్దర్.. కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచీ పోటీ చేశారు గానీ సానుకూల ఫలితం రాలేదు. భారత్ రాష్ట్ర సమతి అభ్యర్థి జీ లాస్య నందిత చేతిలో పరాజయాన్ని చవి చూశారు. మూడో స్థానంలో నిలిచారు.
గద్దర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ వద్ద గద్దర్ పేరు మీద భారీ విగ్రహాన్ని నెలకొల్పనుంది. స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికోసం మున్సిపల్ శాఖ అనుమతులను మంజూరు చేసింది.
తెల్లాపూర్ వద్ద 1,076.4 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఈ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థలాన్ని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీకి బదలాయించింది. విగ్రహం ఏర్పాటు పనులను హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తుంది.












Click it and Unblock the Notifications