తెలంగాణలో 'లాక్‌డౌన్'.. అందులో నిజం లేదన్న ప్రజారోగ్య శాఖ.. స్వస్థలాల బాట పట్టిన వలస కార్మికులు
తెలంగాణలో లాక్‌డౌన్ విధించబోతున్నారన్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించాలని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా కొన్ని మీడియా చానెళ్లు,సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. అది పూర్తిగా అవాస్తవమని... లాక్‌డౌన్ ప్రతిపాదనలేవీ ప్రభుత్వానికి పంపించలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ కేసుల ఉధృతి స్థిరంగా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తే 3,4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందన్నారు.

ఆ ఆలోచన,ఉద్దేశం లేవు.. : ప్రజారోగ్య శాఖ
రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన గానీ,ఆ ప్రతిపాదనలు పంపించాలన్న ఉద్దేశం గానీ వైద్యారోగ్య శాఖకు లేవని డా.శ్రీనివాస్ వెల్లడించారు.100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి విపత్తులు సంభవిస్తాయని... ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు.రాబోయే 3, 4 వారాలు చాలా కీలకమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 45 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో దశలవారీగా అందరికీ వ్యాక్సిన్ వేస్తామన్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు.

అనుమానంతో వచ్చి అంటించుకుంటున్నారు...
కరోనా గురించి అనవసర భయాందోళన అవసరం లేదని డా.శ్రీనివాస్ పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలు ఉంటేనే కరోనా ఉన్నట్లని... అనవసరంగా కోవిడ్ పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరవద్దని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న ఎందరో భయంతో పరీక్షలకు రావడం లేదని అన్నారు. కొంతమంది కోవిడ్ లక్షణాలు లేకపోయినా, అనుమానాలతో పరీక్షలకు వచ్చి కరోనా అంటించుకుంటున్నారని అన్నారు. రెండు మూడు రోజులు గడిచినా కరోనా లక్షణాలు తగ్గపోతేనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. 80 శాతం మంది కరోనా పేషెంట్లకు ఆసుపత్రులు అవసరం లేదని... డాక్టర్ల సలహాతో ఇంట్లోనే ఉండి మందులు వాడుతూ కోలుకోవచ్చని చెప్పారు.
Recommended Video

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వలస కార్మికులు
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు పోటెత్తారు. స్వస్థలాలకు వెళ్లేందుకు చాలామంది రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. గత 10 రోజులుగా రైల్వే స్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నట్లు చెప్పారు. ఉత్తరాదికి చెందిన చాలామంది వలస కార్మికులు మళ్లీ స్వస్థలాలకు వెళ్తున్నారు. గత లాక్‌డౌన్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాల రీత్యా... ముందు జాగ్రత్తగా వారు నగరాన్ని వీడుతున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ విధించే ప్రతిపాదనలేవీ లేవని ప్రజా రోగ్య శాఖ స్పష్టం చేయడంతో వలస కార్మికుల వలసలకు బ్రేక్ పడుతుందా లేదా అన్నది చూడాలి.












Click it and Unblock the Notifications