శ్రీనివాస్ గౌడ్‌కు చుక్కెదురు: మంత్రి పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలన్న మంత్రి శ్రీనివాస్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. మంత్రిపై వేసిన మహబూబ్‌నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది.
ఎన్నికల అఫిడవిట్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రాఘవేంద్ర రాజు. అయితే, ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మంత్రి వాదనను తోసిపుచ్చింది. రాఘవేంద్ర రాజు పిటిషన్‌ను విచారణకు అనుమతి ఇచ్చింది.

ఇది ఇలావుండగా, తెలంగాణ హైకోర్టు మంగళవారం మరో సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటు వేస్తూ తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో అత్యంత సమీప అభ్యర్థి అయిన జలగం వెంకటరావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వనమా విజయంపై జలం వెంకట్రావ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదన్న ఆరోపణలున్నాయి. ఇవి నిజమని గుర్తించిన కోర్టు వనమాపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది.
కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థి తన పేరుతోపాటు తన భార్య పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు అన్నింటినీ దాఖలు చేయాల్సి ఉన్నా.. ఫాం 26 కింద అఫిడవిట్ దాఖలు చేయలేదు. తన ఆస్తులను నామినేషన్ సమయంలో చూపించలేదు వనమా వెంకటేశ్వరరావు. ఇదే విషయాన్ని ఓడిపోయిన జలగం వెంకట్రావు.. 2019లో హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, దీనిపై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. తీర్పు అప్పీల్ చేయడానికి.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు 30 రోజుల సమయం కూడా హైకోర్టు ఇచ్చింది.












Click it and Unblock the Notifications