Hyper Adi : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి షాక్-ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మ, తెలంగాణ యాస, భాషలను కించపరిచేలా హైపర్ ఆది స్కిట్ ప్రదర్శించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన జాగృతి సభ్యులు హైపర్ ఆదిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్,మల్లెమాల ప్రొడక్షన్‌పై కూడా చర్యలు తీసుకోవాలని జాగృతి సభ్యులు కోరినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు. ఫిర్యాదుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆదివారం(జూన్ 14) ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రామ్‌లో ఈ స్కిట్‌ను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. గతంలోనూ జబర్దస్త్ హైపర్ ఆది,పలువురు జబర్దస్త్ కమెడియన్లు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇదే హైపర్ ఆది అనాథ పిల్లల మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ ప్రదర్శించాడని అప్పట్లో అనాథ పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో గౌడ కులస్తులను కించపరిచేలా స్కిట్ ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు కమెడియన్ వేణుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లో జరిగిన ఈ దాడి అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.
జబర్దస్త్‌లో అసభ్య పదాలు,అనైతిక దృశ్యాలు చూపిస్తారన్న ఆరోపణలతోనూ గతంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు,రోజాలపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications